Mumbai Rains: ముంబైలో కుండపోత వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
ABN, Publish Date - Aug 19 , 2025 | 11:55 AM
ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవన స్తంభించింది. బస్సు, రైలు, విమాన సర్వీసులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారతీయ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ముంబై: భారీ వర్షాలకు ముంబై నగరం అతలాకుతలం అవుతోంది. నేడూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జన జీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబైతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ భారతీయ వాతావరణ శాఖ తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి.
వర్షాల కారణంగా విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ముంబై నుంచి బయలుదేరాల్సిన 155 విమాన సర్వీసుల్లో జాప్యం జరిగింది. ముంబై ఎయిర్‌పోర్టుకు రావాల్సిన మరో 102 విమానాల ల్యాండింగ్ కూడా ఆలస్యం కానుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రయాణికులకు ఇండిగో అలర్టులు జారీ చేసింది. మరోవైపు ఎయిర్‌పోర్టుకు వచ్చే పలు మార్గాలు నీట మునిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫలితంగా కార్యకలాపాల నిర్వహణలో ఆటంకాలు ఏర్పడి విమాన రాకపోకల్లో జాప్యం జరుగుతోంది.
వర్షాల కారణంగా నగర జీవనం అస్తవ్యస్థం కావడంతో ముంబై నగర పాలక సంస్థ నేడు సెలవును ప్రకటించింది. అత్యవసర ప్రభుత్వ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు నేడు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని కూడా నగర పాలక సంస్థ సూచించింది. వర్ష బీభత్సం కారణంగా ఇప్పటికే పలు స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. కొంకణ్ ప్రాంతాల్లోని (పాల్‌ఘడ్, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధూదుర్గ్ జిల్లాలు) కాలేజీలకు సెలవు ఇచ్చినట్టు ఉన్నత విద్యాశాఖ పేర్కొంది. రాష్ట్ర రోడ్డు ట్రాన్స్‌పోర్టు బస్సులను కూడా కొన్ని ప్రాంతాల్లో దారి మళ్లించారు. రైళ్ల రాకపోకల్లో కూడా ఆలస్యం చోటుచేసుకుంది. కొన్ని ప్రాంతాల్లో ట్రాక్స్‌పై నీరు చేరడంతో ఆటంకాలు ఏర్పడ్డాయని రైల్వే అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ట్రాక్స్ మధ్య సోలార్ ప్యానెల్స్.. రైల్వే శాఖ వినూత్న ప్రాజెక్టు.. ఎక్కడంటే..
షాకింగ్ ఘటన.. మద్యం మత్తులో ఆటోడ్రైవర్.. మహిళా పోలీసును రోడ్డుపై ఈడ్చుకెళ్లి...
For More National News and Telugu News
Updated Date - Aug 19 , 2025 | 01:19 PM