Railway Tracks-Solar Panels: ట్రాక్స్ మధ్య సోలార్ ప్యానెల్స్.. రైల్వే శాఖ వినూత్న ప్రాజెక్టు.. ఎక్కడంటే..
ABN , Publish Date - Aug 19 , 2025 | 09:43 AM
నికర కర్బన రహిత కార్యకలాపాల దిశగా రైల్వే శాఖ మరో పైలట్ ప్రాజెక్టును ఆవిష్కరించింది. సౌర విద్యుత్ వినియోగం పెంచేందుకు రైల్వే ట్రాక్స్ మధ్య సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసింది. వారణాసిలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు చేపట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: కర్బన ఉద్గారాల రహిత సంస్థగా మారే దిశగా భారతీయ రైల్వే పలు కీలక చర్యలను చేపడుతోంది. సుస్థిర రవాణా వ్యవస్థ రూపకల్పనలో భాగంగా సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచుతోంది. ఇందులో భాగంగా రైల్వే ట్రాక్స్ మధ్యలో ప్రయోగాత్మకంగా సౌర ఫలకాలను కూడా ఏర్పాటు చేసింది. వారణాసిలోని బనారస్ లోకోమోటివ్ వర్క్స్‌కు (బీఎల్‌డబ్ల్యూ) చెందిన వర్క్‌షాప్‌లోని నెం.19 లైన్‌లో వీటిని ఏర్పాటు చేశారు. దేశంలో ఇలాంటి సౌర ఫలకాలు ఉన్న తొలి నగరంగా వారణాసి అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సుస్థిర రవాణా వ్యవస్థ ఏర్పాటులో ఇది తొలి అడుగు అని పేర్కొన్నారు.
పైలట్ ప్రాజెక్టు కింద బీఎల్‌డబ్ల్యూ సోలార్ ప్యానెల్స్‌ను 19వ లైన్‌లో ట్రాక్స్ మధ్య ఏర్పాటు చేసింది. ఇవి చాలా సమర్థమవంతమైనవి, వీటి నిర్వహణ కూడా చాలా సులువని రైల్వే శాఖ పేర్కొంది. పూర్తి దేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన వీటిని రైళ్ల రాకపోకలకు ఆటంకాలు లేకుండా ఏర్పాటు చేయొచ్చని వెల్లడించింది. వీటిపై పర్యవేక్షణ కూడా సులభమని పేర్కొంది. ఈ స్కీమ్ కోసం ఎలాంటి భూసేకరణ అవసరం లేని విషయాన్ని రైల్వే శాఖ పేర్కొంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఏటా 3.5 లక్షల యూనిట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 1.2 లక్షల కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇలాంటి సౌర ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని రైల్వే యోచిస్తోంది.
ఇవి కూడా చదవండి
సీఈసీ అభిశంసనకు ప్రతిపక్షాల యత్నం అంటూ వార్తలు.. కాంగ్రెస్ ఎంపీ కామెంట్ ఏంటంటే..
దేవుడా.. పులులున్న అడవిలో పర్యాటకులను వదిలి పారిపోయిన గైడ్
For More National News and Telugu News