Impeachment CEC: సీఈసీ అభిశంసనకు ప్రతిపక్షాల యత్నం అంటూ వార్తలు.. కాంగ్రెస్ ఎంపీ కామెంట్ ఏంటంటే..
ABN , Publish Date - Aug 18 , 2025 | 01:04 PM
ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై మండిపడ్డ బీజేపీ.. ప్రతిపక్షాల నుంచి ఇంతకుమించి ఏమి ఆశించగలమని కామెంట్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఓట్ల చోరీ ఆరోపణల ఉదంతం మరో మలుపు తిరిగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై (CEC Gyanesh Kumar) పార్లమెంటులో అభిశంసన తీర్మానం (Impeachment) ప్రవేశపెట్టే యోచనలో ప్రతిపక్షాలు ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హీ కూడా అన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవి రాజ్యాంగబద్ధమైనది కావడంతో ఆయనను తొలగించేందుకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. ఉభయసభల్లో మూడంతుల్లో రెండొంతుల మంది ఎంపీలు ఆమోదిస్తేనే సీఈసీ అభిశంసన సాధ్యమవుతుంది. ప్రతిపక్షానికి ఇంతటి బలం ప్రస్తుతం లేదు. ఓట్ల చోరీపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై నిన్నటి పత్రికా సమావేశంలో సీఈసీ గట్టిగా బదులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిశంసన వార్తలు తెరపైకి వచ్చాయి.
ఆదివారం నాటి సమావేశంలో సీఈసీతో పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కూడా పాల్గొన్నారు. ఆరోపణలపై తమకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని తెలిపారు. ఆధారాలను వారం రోజుల్లో సమర్పించాలని లేదా వాటిని నిరాధారంగా పరిగణిస్తామని అన్నారు.
‘కోటికిపైగా అధికారులు.. పది లక్షల పైచిలుకు బూత్ లెవెల్ ఏజెంట్స్, 20 లక్షలకు పైగా పోలింగ్ ఏజెంట్స్ లోక్ సభ ఎన్నికలకు పని చేస్తారు. ప్రక్రియ ఇంత పారదర్శకంగా ఉన్నప్పుడు, ఇంతమంది ముందు ఓట్ల చోరీ సాధ్యమేనా’ అని ప్రశ్నించారు. ‘ఆఫిడవిట్ ఇవ్వాలి లేదా జాతికి క్షమాపణ చెప్పాలి. ఇంతకు మించి మరో ప్రత్యామ్నాయం లేదు. వారం రోజుల లోపల అఫిడవిట్ మాకు అందకపోతే ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా పరిగణిస్తాము’ అని స్పష్టం చేశారు. ఈసీ భుజంపై తుపాకీ గురి పెట్టి ఓటర్లను టార్గెట్ చేస్తామంటే అంగీకరించమని స్పష్టం చేశారు.
ఈ కామెంట్స్‌పై కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ సీఈసీ బీజేపీ ప్రతినిధిలా మాట్లాడారని అన్నారు. న్యాయం కోసం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో తమకు అందుబాటులో ఉన్న సాధానాలను వినియోగిస్తామని పేర్కొన్నారు. ఇక అభింశన వార్తలపై బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ కూడా స్పందించారు. ‘ప్రతిపక్షాల నుంచి ఇంతకు మించి ఏమి ఆశించగలము. సుప్రీం కోర్టు, హైకోర్టు మీద కూడా వారు అభిశంసన ప్రారంభించలేదంటే నాకు కాస్త ఆశ్చర్యంగా ఉంది’ అని ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి
భారత ఆస్ట్రొనాట్ శుభాన్షూ శుక్లా గౌరవార్థం నేడు పార్లమెంటులో ప్రత్యేక చర్చ
దేవుడా.. పులులున్న అడవిలో పర్యాటకులను వదిలి పారిపోయిన గైడ్
For More National News and Telugu News