Mallikarjun Kharge: పహల్గాం దాడిపై మోదీకి ముందే నిఘా సమాచారం
ABN, Publish Date - May 07 , 2025 | 05:29 AM
పహల్గాంలో ఉగ్రదాడికి మూడ్రోజుల ముందు ప్రధాని మోదీకి నిఘా సమాచారం అందింది. ఈ కారణంగా జమ్మూ-కశ్మీరు పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు, అని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు.
దాంతోనే కశ్మీరు పర్యటన రద్దు
రాంచీ సభలో ఖర్గే ధ్వజం
రాంచీ, మే 6: పహల్గాంలో ఉగ్రదాడికి సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి గురించి ప్రధాని మోదీకి ముందే తెలుసన్నారు. మూడ్రోజుల ముందే నిఘా సమాచారం అందిందని.. దాంతో జమ్మూకశ్మీరు పర్యటనను ఆయన రద్దుచేసుకున్నారని తెలిపారు. మంగళవారం రాంచీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ‘సంవిధాన్ బచావో’ ర్యాలీలో ఖర్గే ప్రసంగించారు. ‘పహల్గాం దాడికి మూడ్రోజుల ముందు మోదీకి నిఘా నివేదిక అందిందని.. దాంతో ఆయన జమ్మూకశ్మీరు పర్యటన రద్దుచేసుకున్నారని నాకు తెలియవచ్చింది’’ అని చెప్పారు. ‘‘ఈ సమయంలో జమ్ముకశ్మీర్‌లో పర్యటించడం మీ భద్రతకు మంచిది కాదు’’ అని నిఘా నివేదిక మోదీకి సూచించిందన్నారు. ‘‘అలాంటప్పుడు ప్రజలను రక్షించేలా పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు. పర్యాటకులను రక్షించడానికి మరిన్ని బలగాలను ఎందుకు పంపలేదు’’ అని ఖర్గే నిలదీశారు. అయినా పాకిస్థాన్‌పై కేంద్రం ఏ చర్య తీసుకున్నా కాంగ్రెస్ సమర్థిస్తుందని స్పష్టం చేశారు. గత నెల 19న కాత్రా నుంచి శ్రీనగర్‌కు తొలి రైలును ప్రారంభించేందుకు ప్రధాని కశ్మీరు వెళ్లాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం నెలకొన్న కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.
Updated Date - May 07 , 2025 | 06:25 AM