Terrorist Camps: ఉగ్ర స్థావరాలపై ఉక్కు పాదం
ABN, Publish Date - May 08 , 2025 | 04:07 AM
భారతదేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేసి, పాక్ ఆక్రమిత కశ్మీర్ మరియు పాకిస్థాన్‌లోని 9 కీలక ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా తీసుకుంది. ఎన్‌టీఆర్‌వో ఆధ్వర్యంలో సమగ్రమైన నిఘా ఆధారంగా ఈ దాడులు చేపట్టడంపై భారత్ ఘనమైన విజయాన్ని సాధించింది.
పీవోకేలో 5.. పాకిస్థాన్‌లో 4 టెర్రర్ క్యాంపుల్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేసిన భారత్
పార్లమెంటులో.. పహల్గాంలో.. పఠాన్‌కోట్‌లో.. పుల్వామాలో.. ఇలా ఎక్కడ పడితే అక్కడ పదే పదే విచక్షణరహిత దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదుల పీచమణచడానికి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా భారతదేశం వారికి చెందిన 9 కీలక స్థావరాలను గుర్తించింది. నిఘా వర్గాల ద్వారా వాటికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి అనూహ్యంగా అర్ధరాత్రి దాడులు చేపట్టి అరగంటలోపే పని ముగించేసింది. పుల్వామాలో నలభై మంది భారతీయ సైనికులను బలిగొన్న జైషే మహమ్మద్ ఉగ్రవాదుల కీలక స్థావరాలు.. సముద్ర మార్గంలో ముంబైలోకి చొరబడి నరమేధం సృష్టించిన అజ్మల్‌కసబ్‌కు శిక్షణ ఇచ్చిన ఉగ్ర శిబిరం.. పహల్గాం దాడికి సూత్రధారి అయిన లష్కరేతాయిబాకు చెందిన కీలక క్యాంపులపై క్షిపణులతో విరుచుకుపడింది! పదుల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది. భారత్ దాడిలో తునాతునకలైన ఆ తొమ్మిది ఉగ్రవాద క్యాంపుల్లో ఐదు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉండగా.. నాలుగు పాకిస్థాన్‌లో ఉన్నాయి. ఆ వివరాలు..
సయ్యద్‌నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ (పీవోకే)
నియంత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రశిబిరమిది. ఆయుధాల డిపోగా, పేలుడుపదార్థాల గిడ్డంగిగా, అడవుల్లో మనుగడ సాగించడం ఎలాగో ఉగ్రవాదులకు నేర్పే శిక్షణ శిబిరంగా దీన్ని వాడుతున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జైషే మొహమ్మద్ ప్రధాన కేంద్రమిది. ముజఫరాబాద్‌లో రెడ్‌ఫోర్ట్‌కు ఎదురుగా ఉంటుంది. భారత్‌లోకి చొరబడే జైషే ఉగ్రవాదులు.. పీవోకేలో ఇక్కడే మకాం వేస్తారు. నిత్యం కనీసం 50 నుంచి 100 మంది ఈ క్యాంపులో ఉంటారని అంచనా.
షవాయ్ నాలా క్యాంప్, ముజఫరాబాద్ (పీవోకే)
ఇది నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ముజఫరాబాద్-నీలమ్ రోడ్‌లో చెలాబండి బ్రిడ్జికి సమీపంలో ఉంది. లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాద శిక్షణ శిబిరం ఇది. 2024లో సోనామార్గ్, గుల్‌మార్గ్‌లో.. తాజాగా పహల్గాంలో దాడులకు పాల్పడిన ఉగ్రమూకలకు శిక్షణ ఇచ్చింది ఈ శిబిరంలోనే. లష్కరే నడిపే అత్యంత కీలకమైన శిబిరమిది. 2000 సంవత్సరం నుంచి ఇక్కడ ఉగ్రవాదుల నియామకం, శిక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కాల్పులు జరపడంలో శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ ఫైరింగ్ రేంజ్, ఒక మదర్సా ఉన్నాయి. దాదాపు 250 మంది దాకా టెర్రరిస్టులు ఉండడానికి అవసరమైన ఏర్పాట్లున్నాయి. శిక్షణ కోసం వచ్చేవారికి ఇక్కడ లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ స్వయంగా స్వాగతం పలికేవాడని చెబుతారు. పాక్ గూఢచార సంస్థ ఐఎ్‌సఐ.. ఇక్కడ ఉగ్రవాదులకు శిక్షణనిచ్చేందుకుగాను ఆర్మీ ట్రైనర్లను పంపుతుంది. వారికి ఇక్కడ కాల్పులు జరపడం, బాంబులు, గ్రనేడ్‌లు వేయడంతోపాటు.. జీపీఎ్‌సను వినియోగించడం, మ్యాపులను అర్థం చేసుకోవడం వంటివాటిలో 21 రోజులపాటు ప్రాథమిక శిక్షణ ఇస్తారు. దీన్ని ‘దౌరా ఈ ఆమ్’ ట్రైనింగ్‌గా వ్యవహరిస్తారు.
మర్కజ్ తయ్యబా, మురీద్‌కే (పాకిస్థాన్)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2008లో దారుణ మారణకాండ సాగించిన అజ్మల్ కసబ్, ఆ దాడి సూత్రధారులైన డేవిడ్ హెడ్లీ, తహావుర్ రాణా వంటివారికి ‘దౌరా ఏ రిబ్బత్’ (నిఘా కార్యకలాపాల్లో) శిక్షణ ఇచ్చిన క్యాంపు ఇది. 2000 సంవత్సరంలో దీని ఏర్పాటుకు.. ఒసామా బిన్ లాడెన్ కోటి రూపాయల నిధులు ఇచ్చినట్టు చెబుతారు. ఇండో-పాక్ సరిహద్దుకు 18 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందిది. లష్కరే తాయిబా కీలక ఉగ్రవాద శిక్షణ శిబిరాల్లో ఒకటి. దాదాపు 82 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ క్యాంపులో.. ఒక మదర్సా, మార్కెట్, ఉగ్రవాదుల నివాసాలు, క్రీడా ప్రాంగణం, చేపల పెంపకం కేంద్రం, చిన్నపాటి వ్యవసాయ భూములు ఉంటాయి. లష్కరే సిద్ధాంతకర్తలైన అమీర్ హంజా, అబ్దుల్ రెహ్మాన్ అబిద్, జాఫర్ ఇక్బాల్ ఈ క్యాంపులోనే నివసిస్తుంటారు. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించి.. జిహాద్‌లో పాల్గొనేలా చేయడమే లక్ష్యంగా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. ఇది ఉగ్రవాదులను తయారుచేసే కర్మాగారం.
మర్కజ్ సుభానల్లా, బహావల్ పూర్ (పాక్)
ఇది జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయం. భారత సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలో.. పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్‌లో.. ఆ దేశ ఆర్మీ కంటోన్మెంట్‌కు కొన్ని మైళ్ల దూరంలో 18 ఎకరాల విస్తీర్ణంలో ఉందీ ఉగ్రవాద శిబిరం. జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ పుట్టి పెరిగింది ఈ ఊళ్లోనే. అతడి నివాసం కూడా ఈ క్యాంప్‌లోనే ఉంది. 2001లో పార్లమెంటులపై దాడి, 2016లో పఠాన్‌కోట్ దాడి, 2019లో పుల్వామా దాడి సహా.. భారత్‌లో జైషే మొహమ్మద్ చేసిన పలు ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించింది ఇక్కడే. 600 మందికి పైగా ఉగ్రవాదుల నివాసాలు ఇక్కడ ఉంటాయి. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ జరిపిన దాడిలో ఈ క్యాంపులోని జామియా మసీదు పైభాగంలో పెద్ద రంధ్రం పడింది. మసీదు ధ్వంసమైంది. దాడులు జరిగిన సమయంలో అక్కడే ఉన్న మసూద్ అజర్ అక్క, బావ, అజర్ మేనల్లుడు, అతడి భార్య, మేనకోడలు, దగ్గరి బంధువుల పిల్లలు మరో ఐదుగురు, అతడి సన్నిహితులు నలుగురు మరణించారు.
సర్జాల్ తెహ్రా లాంచింగ్ సెంటర్ (పాక్)
అంతర్జాతీయ సరిహద్దుకు, జమ్ములోని సాంబా సెక్టార్‌కు.. కేవలం 6 కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్‌లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉందీ జైషే ఉగ్రవాద క్యాంపు. బోర్డర్‌కు అత్యంత సమీపాన ఏర్పాటు చేసుకున్న ఈ క్యాంపును.. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపే లాంచ్‌ప్యాడ్‌లా వాడుతుంటారు. ఉగ్రవాదులను అలా భారత్‌లోకి పంపడానికి ఏయే ప్రదేశాలు అనువైనవో గుర్తించి, అక్కడ సొరంగాలు తవ్వడం, డ్రోన్ల ద్వారా కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాదులకు ఆయుధాలు, డ్రగ్స్ పంపడం వంటి పనులు ఇక్కడి నుంచే చేస్తుంటారు. ఇటీవలికాలంలో.. డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులను సైతం భారత్‌లోకి పంపేందుకు ఇక్కడ కుట్రలు పన్నుతున్నట్టు సమాచారం.
మర్కజ్ అబ్బాస్, కోట్లీ (పీవోకే)
నియంత్రణ రేఖకు 13 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్ర శిబిరం ఇది. ఆత్మాహుతి దాడులకు పాల్పడే ఫిదాయీలకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. 100-125 మంది ఉండడానికి ఏర్పాట్లుంటాయి. ఎప్పుడూ కనీసం 40-50 మంది ఉంటారు. పఠాన్‌కోట్ దాడికి ముందు జైషే సంస్థ తన ఆయుధాలను సియాల్‌కోట్‌లోని దస్కా మర్కజ్‌లో భద్రపరిచేది. తర్వాత ఇక్కడికి మార్చింది.
మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా (భింబర్, పీవోకే)
నియంత్రణ రేఖ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో బర్నాలా పట్టణ శివార్లలో ఉందీ టెర్రర్ క్యాంప్. ఆయుధాలు, ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివై్‌సల నిల్వకు, ఉగ్రవాదులను, ఆయుధాలను పూంచ్-రాజౌరీ-రెయిసీ సెక్టార్‌లోకి దొంగతనంగా పంపించడానికి లష్కరే ఉపయోగిస్తున్న కీలక హబ్ ఇది. ఇక్కడ 100-150 మంది ఉండడానికి ఏర్పాట్లు ఉంటాయి. సాధారణంగా ఎప్పుడూ 40-50 మంది ఉంటారు. షవాయ్‌నాలాలో ప్రాథమిక శిక్షణ అనంతరం.. అంచెలంచెలుగా పూర్తి శిక్షణ పొందిన లష్కరే ఉగ్రవాదులను చివరిగా ఇక్కడికి తెస్తారు. వారు ఇక్కణ్నుంచే భారత్‌లోకిచొరబడతారు.
మెహమూనా జోయా, సియాల్ కోట్ (పాక్)
ఇది హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రధాన ఉగ్రవాద శిబిరాల్లో ఒకటి. అంతర్జాతీయ సరిహద్దుకు 12 నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. కథువా-జమ్ము ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తుంటారు. దీన్ని కూడా భారత్‌లోకి ఉగ్రవాదులను పంపే లాంచ్‌ప్యాడ్‌లా వాడుతుంటారు. వారికి ఆయుధాలు వాడడంలో శిక్షణ ఇస్తారు. జమ్ములో పలు దాడులు చేసిన ఉగ్రవాది మొహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ ఈ క్యాంపు ప్రధాన కమాండర్. 1995లో జనవరి 26న జమ్ములోని మౌలానా అజాద్ స్టేడియంలో పేలుళ్లు జరిపింది అతడే.
మస్కర్ రహీల్ షాహీద్, గుల్పూర్ క్యాంప్, కోట్లీ (పీవోకే)
నియంత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లష్కరే ఉగ్ర శిబిరమిది. 2023లో పూంచ్‌లో ఉగ్రదాడి, 2024లో యాత్రికులపై ఉగ్రదాడి చేసింది.. ఈ క్యాంపులో శిక్షణ పొందిన ఉగ్రవాదులే. దీన్ని ఉగ్రవాదులకు శిక్షణనివ్వడంతోపాటు.. వారి నివాసాలకు, ఆయుధాల నిల్వకు వినియోగిస్తారు.
ఎలా గుర్తించారంటే..
పాకిస్థాన్‌లోగానీ, పీవోకేలోగానీ.. ఎక్కడా పౌర ఆవాసాలను, సైనిక స్థావరాలను తాకకుండా కేవలం టెర్రర్ క్యాంపులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కచ్చితమైన దాడులు జరపడం ద్వారా భారతదేశం పాక్‌ను తీవ్రస్థాయిలో ఇరకాటంలోకి నెట్టగలిగింది. ఇంతకీ భారత్ ఇంత కచ్చితంగా ఉగ్రస్థావరాల పైనే దాడులు ఎలా చేయగలిగింది? అంటే.. దాని వెనుక కీలకపాత్ర పోషించింది ‘నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్‌వో)’. ఆ సంస్థ పీవోకేలో, పాక్‌లో ఉగ్రవాదుల కదలికలను నిశితంగా పరిశీలించి, ఈ క్యాంపుల సమాచారాన్ని సైన్యానికి చేరవేసింది. 2004లో ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఇది జాతీయ భద్రత సలహాదారు, పీఎంవో ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా వేసి.. సమాచారాన్ని సేకరించడం, దేశ ప్రయోజనాలను కాపాడడమే దీని ప్రధాన విధులు.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News
Updated Date - May 08 , 2025 | 04:09 AM