Kerala Student Sona : మతం మారమని ప్రియుడు, అతని ఫ్యామిలీ వేధింపులు.. కేరళ విద్యార్థిని ఆత్మహత్య
ABN, Publish Date - Aug 11 , 2025 | 06:31 PM
కేరళలో 23 ఏళ్ల సోనా ఎల్డోస్ అనే విద్యార్థిని టీచర్స్ ట్రైనింగ్ కోర్సు చదువుతోంది. ఆమె రమీజ్ అనే వ్యక్తిని కొంతకాలంగా ప్రేమిస్తోంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, రమీజ్.. అతని ఫ్యామిలీ.. సోనాను తమ మతంలోకి మారాలంటూ..
కేరళ, ఆగష్టు 11 : కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో 23 ఏళ్ల సోనా ఎల్డోస్ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ప్రియుడు, అతని బంధువులు వివాహం చేసుకోవాలంటే ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేశారని, అందుకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబం ఆరోపించింది. కేరళలోని కోతమంగళానికి చెందిన సోనా ఎల్డోస్ శనివారం తన నివాసంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. పోలీసులు మొదట అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. కానీ తరువాత మృతురాలు రాసిన సూసైడ్ నోట్ లభించడంతో ఈ కేసును 'మతమార్పిడి కోసం శారీరక దాడి, మానసిక వేధింపులు' అనే సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.
బాధితురాలి ప్రియుడి అరెస్టు
తమ మతంలోకి మారమని రమీజ్ తనను బలవంతం చేశాడని.. సోనా తన సూసైడ్ నోట్ లో పేర్కొనడంతో రమీజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమీజ్ పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69(వివాహానికి తప్పుడు హామీ ఇచ్చి లైంగిక సంపర్కానికి పాల్పడ్డం) కింద కేసు నమోదు చేశారు. సోనా తల్లి, వాళ్ల ఇంటి పనిమనిషి బిందు ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు. రమీజ్ కుటుంబం గతంలో వివాహ ప్రతిపాదనను తీసుకువచ్చిందని.. పెళ్లి కోసం సోనాను తమ మతంలోకి మారాలని పట్టుబట్టారని చెప్పుకొచ్చారు. సోనా మొదట దీనిని ప్రేమతో అంగీకరించిందని, కానీ రమీజ్ అనైతిక వ్యవహారాలు చూసిన తర్వాత నిరాకరించిందని వాళ్లు తెలిపారు. తన కుమార్తె రమీజ్ ను ఎంతగానో ప్రేమించిందని, అయితే, మతం మారాలంటూ చాలా కాలంగా చిత్రవథ చేశారని సోనా తల్లి అంటోంది. వేధింపులు తట్టుకోలేక సోనా ఎట్టిపరిస్థితుల్లోనూ మతం మారనని తేల్చి చెప్పిందని పనిమనిషి బిందు మీడియాకు చెప్పింది. దీంతో సోనాను ఒక గదిలో బంధించారని, బాధితురాలి సోదరుడిని కూడా కొట్టారని బిందు తెలిపింది.
ఇవీ చదవండి:
ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారత టెక్స్‌టైల్ ఉత్పత్తుల దిగుమతులకు అమెరికా సంస్థల బ్రేక్
పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందా.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం
Updated Date - Aug 11 , 2025 | 07:23 PM