Inactive Pan Card: పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందా.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం
ABN , Publish Date - Aug 07 , 2025 | 03:51 PM
ఇనాక్టివ్ అయిన పాన్ కార్డు మళ్లీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో, ఇందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా పాన్ తప్పనిసరి అన్న విషయం అందరికీ తెలిసిందే. పాన్ కార్డు ఆధారంగానే బ్యాంకులు లబ్ధిదారుల రుణ చరిత్రను తెలుసుకుంటాయి. దీని ఆధారంగా రుణం మంజూరు చేయాలా వద్దా అనే విషయాన్ని నిర్ధారించుకుంటాయి. ఈ నేపథ్యంలో పాన్ కార్డు ఇనాక్టివ్ అయితే చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, పాన్ కార్డు ఇనాక్టివేషన్ సమస్యకు పరిష్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పాన్ కార్డు ఎప్పుడు ఇనాక్టివ్ అవుతుందంటే..
ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం కాని పక్షంలో ఐటీ శాఖ కార్డును డీయాక్టివేట్ చేస్తుంది. డీయాక్టివేట్ అయిన పాన్ కార్డుతో ఎలాంటి లావాదేవీలు జరపడం కుదరదు.
ఇక ఒక వ్యక్తికి ఒకటికంటే ఎక్కువ కార్డులు ఉన్నా చిక్కుల్లో పడ్డట్టే. అలాంటి అదనపు కార్డులను ఐటీ శాఖ డీయాక్టివేట్ చేస్తుంది.
పాన్ కార్డు ఫేక్ అని నిర్ధారణ అయిన పక్షంలో డీయాక్టివేషన్ జరుగుతుంది.
పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందీ లేనిదీ ఐటీ శాఖ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ముందుగా అధికారిక ఐటీ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ ను సందర్శించాలి. సైట్‌లోని వెరిఫై పాన్ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత పాన్ నంబర్, కార్డుదారుడి పేరు, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే పాన్ కార్డు యాక్టివ్ గా ఉందా ఇనాక్టివ్‌గా ఉందా తెలిసిపోతుంది. కార్డు ఇనాక్టివ్‌గా ఉంటే ఆ మేరకు ఫోన్‌కు మెసేజ్ వస్తుంది.
కార్డును యాక్టివేట్ చేసుకోవాలంటే..
కార్డు యాక్టివేషన్ కోసం సంబంధిత ఐటీ శాఖ రీజినల్ ఆఫీసులోని అసెసింగ్ ఆఫీసర్‌కు అధికారికంగా లేఖ రాయాలి. ఐటీ శాఖ పేరిట ఇండెమ్నిటీ బాండ్‌ను జత చేయాలి. కార్డుతో చివరి మూడేళ్లుగా దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌ల వివరాలను దాఖలు చేయాలి. ఆధార్ కార్డు, వోటర్ ఐడీ, బ్యాంక్ స్టేట్‌మెంట్ తదితర వివరాలను కాపీలనూ జత చేయాలి. ఆ తరువాత దరఖాస్తు పరిశీలన పూర్తయ్యేందుకు కనీసం 15 రోజులు పట్టే అవకాశం ఉంది. వెరిఫికేషన్ పూర్తయ్యాక కార్డు యాక్టివేట్ అవుతుంది.