Share News

Indian Textiles Export Halt: ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారత టెక్స్‌టైల్ ఉత్పత్తుల దిగుమతులకు అమెరికా సంస్థల బ్రేక్

ABN , Publish Date - Aug 08 , 2025 | 10:07 AM

ట్రంప్ సుంకాల కారణంగా భారతీయ టెక్స్‌టైల్ ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన వాల్‌మార్ట్, అమెజాన్ వంటి రిటెయిలర్లు భారత నుంచి టెక్స్‌టైల్స్, దుస్తుల దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Indian Textiles Export Halt: ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారత టెక్స్‌టైల్ ఉత్పత్తుల దిగుమతులకు అమెరికా సంస్థల బ్రేక్
Amazon Walmart Halt Indian Textile Imports

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా విధించిన సుంకాల ప్రభావం మొదలైంది. వాల్‌మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ వంటి ప్రముఖ అమెరికన్ రిటెయిలర్లు భారత్‌ నుంచి టెక్స్‌టైల్ దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని అమెరికా సంస్థలు కొన్ని ఇప్పటికే భారతీయ ఎగుమతిదారులకు లేఖలు, ఈ-మెయిల్స్ ద్వారా తెలియజేసినట్టు సమాచారం.

సుంకాల ద్వారా పెరిగే అదనపు ఖర్చులు ఎగుమతిదారులే భరించాలని అమెరికా సంస్థలు కోరుతున్నట్టు సమాచారం. సుంకాల కారణంగా అమెరికా మార్కెట్‌లో భారతీయ టెక్స్‌టైల్ ఉత్పత్తుల ధరలు 30 నుంచి 35 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎగుమతులు 40 శాతం నుంచి 50 శాతం మేర పడిపోయే అవకాశం ఉందని సమాచారం.


వెల్స్‌పన్ లివింగ్, గోకుల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్, ఇండో కౌంట్, ట్రైడెంట్ వంటి సంస్థలు తమ ఉత్పత్తుల్లో 40 శాతం నుంచి 70 శాతం వరకూ అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. ఇక, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాల టెక్స్‌టైల్, అపారెల్ ఉత్పత్తులపై 20 శాతం సుంకం అమలవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా రిటెయిల్ సంస్థలు భారత్‌కు బదులు ఈ దేశాలవైపు మళ్లే అవకాశం ఉందని భారతీయ ఎక్స్‌పోర్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారత్‌లో తయారయ్యే దుస్తులు, టెక్స్‌టైల్ ఉత్పత్తుల్లో అత్యధికంగా 28 శాతం అమెరికాకు ఎగుమతి అవుతుంటాయి. గతేడాది ఈ ఎగుమతుల విలువ దాదాపు 36.31 బిలియన్ డాలర్లుగా ఉంది.

రష్యా చమురు కొనుగోళ్లపై అభ్యంతరం చెబుతూ డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై తొలుత 25 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది. బుధవారం మరో 25 శాతం సుంకం విధిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 27 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయన్నారు. అయితే, జాతీయ ప్రయోజనాలతో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ ఇటీవల జరిగిన ఓ సభలో స్పష్టం చేశారు.


ఇవీ చదవండి:

పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందా.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం

వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా

Read Latest and Business News

Updated Date - Aug 08 , 2025 | 10:37 AM