KN Rajanna : రాహుల్ వ్యాఖ్యలతో విభేదించిన కర్ణాటక మంత్రి కెఎన్ రాజన్న రాజీనామా
ABN, Publish Date - Aug 11 , 2025 | 05:34 PM
కర్ణాటక మంత్రి కెఎన్ రాజన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తన రాజీనామాను సమర్పించారు. రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చేసిన 'ఓటు చోరీ' ఆరోపణలను రాజన్న బహిరంగంగా విమర్శించారు. అప్పట్లో మన పార్టీ నాయకులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
బెంగళూరు, ఆగష్టు 11 : కర్ణాటక సహకార శాఖ మంత్రి కెఎన్ రాజన్న తన పదవికి రాజీనామా సమర్పించారు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తన రాజీనామాను సమర్పించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చేసిన 'ఓటు చోరీ' ఆరోపణలను రాజన్న బహిరంగంగా విమర్శించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఓటరు జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అయితే, రాజన్న, ఈ అక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, అప్పట్లో పార్టీ నాయకులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్నించారు.
స్వంత పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కూడా రాజన్న చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపరిచాయి. పార్టీ అధికారిక వైఖరికి విరుద్ధంగా రాజన్న మాట్లాడటంతో పార్టీ హైకమాండ్ తోపాటు, కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా ఖంగుతున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు రాజన్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. దీంతో, కాంగ్రెస్ అధిష్టానం రాజన్నను రాజీనామా చేయాలని ఆదేశించింది. సీఎం సిద్ధరామయ్యతో చర్చల అనంతరం రాజన్న తన రాజీనామాను సమర్పించారు. సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితుడైనప్పటికీ పార్టీ ఒత్తిడి మేరకు రాజన్న రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇది బీజేపీ తనకు అనుకూలంగా మల్చుకుని రాహుల్ గాంధీ పై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తోంది. ఎన్నికల సంఘం పట్ల రాహుల్ గాంధీ అనుసరిస్తున్న విధానం పూర్తిగా తప్పుడు విధానమని విమర్శిస్తోంది. రాహుల్ వైఖరిని స్వంత కాంగ్రెస్ సీనియర్ నేతలే తప్పుపడుతున్నారని ఎద్దేవా చేస్తోంది. ఇక, రాజీనామా చేసిన రాజన్నను దమ్మున్నోడు అంటూ కీర్తిస్తోంది. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం లేదని.. నిజం చెబితే రాజీనామా చేయమని అడుగుతారని కర్ణాటక బిజెపి సీనియర్ నేత సిటి రవి విమర్శించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా దాదాపు మూడేళ్లకు పైగా అధికారం ఉంది. మంత్రిగా ఉండి కూడా.. దీనిని కూడా కాలదన్ని రాజన్న నిజాయితీగా వాస్తవాల్ని చెప్పే ప్రయత్నం చేశారని.. కన్నడిగులు శహభాష్ రాజన్న అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అధికారమే పరమావధిగా నేతలు పార్టీలు ఫిరాయిస్తున్న ఈ రోజుల్లో రాజన్న తీరుని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పార్టీ విలీనంపై కేసీఆర్ అత్యవసర సమావేశం..!
కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వం అసమర్థత బయటపడింది
Updated Date - Aug 11 , 2025 | 05:47 PM