Share News

KTR Criticizes Congress: కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వం అసమర్థత బయటపడింది

ABN , Publish Date - Aug 11 , 2025 | 02:08 PM

రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైందని ఆరోపించారు. కాగ్ నివేదిక ప్రకారం, రాష్ట్ర ఆదాయం పడిపోవటంతో పాటు అప్పులు భారీగా పెరిగాయని కేటీఆర్ ఆక్షేపించారు.

KTR Criticizes Congress: కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వం అసమర్థత బయటపడింది
KTR Criticizes Congress

హైదరాబాద్, ఆగస్టు11(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ (Congress) పాలనలో తెలంగాణ (Telangana) తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ (BRS) పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) ఆరోపణలు చేశారు. ఆరు గ్యారంటీల అమలు సంగతేమో కాని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీగా ఖతం పట్టించిందని విమర్శించారు. కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వ అసమర్థత మరోసారి బయటపడిందని ఎద్దేవా చేశారు. ఇవాళ(సోమవారం) ఓ ప్రకటన విడుదల చేశారు మాజీ మంత్రి కేటీఆర్.


ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుడా, ఒక్క ప్రాజెక్టు కట్టకుండా, విద్యార్థులకు మంచి భోజనం పెట్టకుండా అప్పులతో ఏం చేస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్.


అప్పుల్లో తెలంగాణ.. లోటు బడ్జెట్‌తో ఆందోళన

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైందని కేటీఆర్ ఆరోపించారు. కాగ్ నివేదిక ప్రకారం, రాష్ట్ర ఆదాయం పడిపోవటంతో పాటు అప్పులు భారీగా పెరిగాయని ఆక్షేపించారు. మిగులు బడ్జెట్‌తో ప్రారంభమైన తెలంగాణ, ఇప్పుడు రూ.10,583 కోట్ల రెవెన్యూ లోటును ఎదుర్కోవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. పన్నేతర ఆదాయం కూడా దారుణంగా పడిపోయిందని, బడ్జెట్‌లో అంచనా వేసిన దానిలో కేవలం 3.37 శాతం మాత్రమే వసూలు అయిందని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్.


నిధులు ఎటు పోతున్నాయి?

అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ప్రతీ రోజూ అప్పు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఇప్పటికే రూ. 20,266 కోట్లు అప్పుగా తీసుకుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వార్షిక లక్ష్యంలో ఇది 37.5 శాతమని ఆక్షేపించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆటో-పైలట్‌లో ఉందని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ఈ ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉందో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

రేవంత్‌పై దాఖలైన అట్రాసిటీ కేసులో పిటీషనర్‌కు సుప్రీం చురకలు

హైదరాబాద్‌లో ఘరానా మోసం.. దొంగ స్వామీజీ బురిడీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 02:14 PM