Operation Sindoor: పాక్‌కు భారీ నష్టం
ABN, Publish Date - May 12 , 2025 | 04:36 AM
ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌లోని కీలక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి లక్ష్యాలను సాధించామని భారత త్రివిధ దళాధిపతులు తెలిపారు. పాక్ దాడులకు తగిన ప్రతీకారం తీసుకున్నామని, తాము సజాగ్రత్తగా సంయమనంతో ముందుకెళ్లామని స్పష్టం చేశారు.
35-40 మంది సైనికుల మృతి.. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం
ఉగ్రవాదుల ఏరివేత, సూత్రధారుల ఊచకోతే
లక్ష్యాలుగా ఆపరేషన్ సిందూర్.. వాటిని సాధించాం
దుస్సాహసాలకుపాల్పడితే భారీ మూల్యం తప్పదు
మీడియా సమావేశంలో డీజీఎంవో రాఘవ్ ఘయ్
యుద్ధంలో నష్టాలూభాగమే.. మన పైలట్లు తిరిగొచ్చారు
డీజీఏవో ఎయిర్ మార్షల్ ఏకే భార్తీ వ్యాఖ్యలు
పాక్ విమానాలు కొన్ని కచ్చితంగా కూలాయని స్పష్టీకరణ
కరాచీ సహా.. భూమ్మీద, సముద్రంలో ఎంపిక చేసిన లక్ష్యాలపై దాడికి అరేబియా సంద్రంలో యుద్ధనౌకలు
పాక్ నేవీ హార్బర్‌కే పరిమితమైంది: వైస్ అడ్మిరల్ ప్రమోద్
న్యూఢిల్లీ, మే 11: ఏ లక్ష్యాలను ఉద్దేశించి ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టామో వాటిని సాధించామని మన త్రివిధ దళాల అధికారులు తెలిపారు. అత్యంత అధునాతనమైన సాంకేతికతతో కూడిన పాక్ యుద్ధవిమానాలను కూల్చేయడం, ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్‌కు సమీపంలో ఉన్నవాటితో సహా పలు కీలక సైనిక స్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా పాకిస్థాన్‌కు భారీ నష్టం చేకూర్చామని వారు వెల్లడించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘయ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ (డీజీఏవో) ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భార్తీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్, మేజర్ జనరల్ ఎస్‌ఎస్ శారద.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన వివరాలను ఆదివారం మీడియాకు వెల్లడించారు. అనంతరం భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ చేసిన దాడులను ఎలా తిప్పికొట్టిందీ వివరించారు. ‘‘చొరబాటుదారులను, ఉగ్రవాదులను, ఉగ్రదాడుల వెనుక సూత్రధారులను శిక్షించడం, వారి స్థావరాలను ధ్వంసం చేయాలన్న స్పష్టమైన సైనిక లక్ష్యంతోనే ఆపరేషన్ సిందూర్‌ను రూపొందించాం’’ అని డీజీఎంవో రాజీవ్ ఘయ్ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాక్, పీవోకేలోని తొమ్మిది కీలక ఉగ్రస్థావరాలను గుర్తించి.. వాటిపై అత్యంత కచ్చితమైన దాడులు నిర్వహించామని..
ఐసీ 814 విమానం హైజాక్, పుల్వామా దాడి వంటివాటికి పాల్పడిన యూసుఫ్ అజర్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదసిర్ అహ్మద్ తదితర 100 మందికిపైగా పాకిస్థానీ ఉగ్రవాదులు ఈ ఆపరేషన్‌లో హతమయ్యారని ఆయన తెలిపారు.
తాము గుర్తించిన ఉగ్ర క్యాంపుల్లో కొన్నింటిని.. ఉగ్రవాదులు అప్పటికే భయంతో ఖాళీ చేశారని ఘయ్ తెలిపారు. ‘మే 7వ తేదీన చేపట్టిన ఆపరేషన్‌లో ఉగ్రవాదులు, వారి మౌలిక సదుపాయాలే మాలక్ష్యం. అంతే తప్ప పాకిస్థానీ పౌరులు, ఆ దేశ సైనిక స్థావరాలు కాదు. మా లక్ష్యాలను మేం కచ్చితంగా సాధించాం. కానీ.. ఆ తర్వాత పాకిస్థానీ డ్రోన్లు మన మిలటరీ ఏరియాలను, పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగాయి. వాటిని విజయవంతంగా కూల్చేశాం’’ అని వివరించారు. నియంత్రణ రేఖ వెంబడి గ్రామాలను, పౌరులను, గురుద్వారాల వంటి మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ చేసిన దాడుల్లో కొందరు అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. అదే సమయంలో.. భారత సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో పాక్ ఆర్మీకి చెందిన 35-40 మంది సిబ్బంది చనిపోయినట్టు తెలిపారు. డ్రోన్లు, క్షిపణులతో మన సైనిక స్థావరాలపై దాడికి పాక్ చేసిన యత్నాల్ని.. దీటుగా తిప్పికొట్టామని స్పష్టం చేశారు. ఇకపై పాక్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే అందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ యుద్ధంలో భారతదేశం అపారమైన సంయమనాన్ని పాటించిందని.. మన చర్యలు స్పష్టమైన లక్ష్యాలతో, తూచినట్టు, ఉద్రిక్తతలను పెంచని విధంగా ఉన్నాయని ఆయన తేల్చిచెప్పారు. భారత సార్వభౌమాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు, పౌరుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లినా తిప్పికొడతామని హెచ్చరించారు. యుద్ధాన్ని ఆపే మార్గం చూడాలంటూ పాకిస్థానీ డీజీఎంవో నుంచి తనకు శనివారం మధ్యాహ్నం ఫోన్ వచ్చిందని రాఘవ్ ఘయ్ తెలిపారు. అయితే.. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా పాకిస్థాన్ ఆర్మీ ఎల్‌వోసీ వెంబడి కాల్పులు తిరిగి మొదలుపెట్టిందని, డ్రోన్లనూ ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు. పాక్ ఉల్లంఘనలకు దీటుగా జవాబు చెప్పేందుకు సైన్యాధ్యక్షుడు తమకు అన్ని అధికారాలూ ఇచ్చాని ఆయన స్పష్టం చేశారు. సీజ్‌ఫైర్ ఉల్లంఘనపై తాను పాక్ డీజీఎంవోకు హాట్‌లైన్ సందేశాన్ని పంపానని.. మరోసారి ఇలాంటివి జరిగితే తీవ్ర ప్రతిదాడులకు దిగుతామని హెచ్చరించానని తెలిపారు. అలాగే.. ఈ యుద్ధంలో అమరులైన ఐదుగురు జవాన్లకు నివాళులు అర్పిస్తున్నానని డీజీఎంవో ఘయ్ పేర్కొన్నారు.
ఇప్పుడే చెప్పలేను..
పాకిస్థాన్‌కు చెందిన ఎన్ని విమానాలను భారత్ కూల్చేసిందన్న ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు.. డీజీఏవో ఏకే భార్తీ నిరాకరించారు. కచ్చితంగా కొన్ని విమానాలను నేలకూల్చామన్న ఆయన.. సంఖ్యను వెల్లడించడానికి తిరస్కరించారు. పాక్ విమానాలు ఎన్నింటిని కూల్చిందీ తనవద్ద నంబర్లు ఉన్నా.. వాటిని రుజువుచేసే సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నామని, కాబట్టి ఈ దశలో తాను సంఖ్యలను చెప్పలేనని వివరించారు. భారత యుద్ధవిమానాలను పాక్ కూల్చేసిందంటూ పాశ్చాత్య మీడియాలో వస్తున్న వార్తల గురించి ప్రస్తావించగా.. ‘‘మనం యుద్ధంలో ఉన్నాం. యుద్ధంలో నష్టాలు కూడా భాగమే’’ అని జవాబిచ్చారు. ఎన్ని విమానాలు కూలాయి? ఏ ప్లాట్‌ఫామ్‌లను కోల్పోయాం వంటి వివరాలపై ఈ సమయంలో తానేమీ మాట్లాడదల్చుకోవట్లేదని.. ఎందుకంటే ఈ దశలో ఏదైనా మాట్లాడితే అది శత్రువులకు అనుకూలంగా మారుతుందని అన్నారు. ‘‘అయినా మీరు అడగాల్సిన ప్రశ్న.. ‘ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలన్న లక్ష్యాన్ని మనం సాధించామా?’ అని. దానికి సమాధానం.. అవును’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఏదేమైనా నేను చెప్పేది ఒక్కటే. మనం ఎంచుకున్న లక్ష్యాలను సాధించాం. మన పైలట్లందరూ సురక్షితంగా వెనక్కి తిరిగొచ్చారు’’ అని ఆయన వివరణ ఇచ్చారు.
కరాచీ సహా..
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రస్థావరాలపై క్షిపణి దాడులు జరుగుతున్న సమయంలో మన నౌకాదళం అరేబియా సముద్రంలో యుద్ధనౌకలను మోహరించడంతో.. పాకిస్థాన్ నేవీ హార్బర్‌కే పరిమితమైందని వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేసిన దాడుల్లో నౌకాదళం పాత్ర గురించి నేవీ వెల్లడించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆదివారంనాటి మీడియా సమావేశంలో మాట్లాడిన వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్.. ఆ వివరాలను వెల్లడించారు. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన 96 గంటల్లోనే.. అరేబియా సముద్రంలో నేవీ క్యారియర్ బ్యాటిల్ గ్రూప్స్, జలాంతర్గాములు తదితరాలను పూర్తి యుద్ధ సన్నద్ధతతో మోహరించామని ఆయన వివరించారు. కరాచీ సహా.. సముద్రంలో, భూమ్మీద ఎంపిక చేసిన లక్ష్యాలపై దాడి చేయడానికి పూర్తి సన్నద్ధతతో, సామర్థ్యంతో నౌకాదళాన్ని సముద్రంలో మోహరించినట్టు తెలిపారు. దీంతో పాకిస్థానీ నౌకదాళ, వాయుసేన విభాగాలు ఆత్మరక్షణలో పడ్డాయని, హార్బర్లలోను, తీరానికి చేరువలో ఉండిపోయాయని.. తాము వాటిని నిరంతరం పరిశీలించామని చెప్పారు.
Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా
Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్
Updated Date - May 12 , 2025 | 06:12 AM