India Counterstrike: 14 రోజుల్లో తిరుగులేని ప్రతీకారం
ABN, Publish Date - May 08 , 2025 | 04:14 AM
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై క్షిపణి దాడులు జరిపి తీవ్ర దెబ్బ కొట్టింది. గతంలో ఉరి, పుల్వామా ఘటనల అనంతరం కూడా ఇలానే మెరుపుదాడులు చేసి ముష్కరులకు తగిన బుద్ధిచెప్పింది.
నాడు ఉరి దాడికి 10 రోజుల్లో జవాబు
పుల్వామా దాడి..12రోజుల్లో ప్రతిచర్య
మెరుపు దాడులతో దెబ్బకొట్టిన భారత్
న్యూఢిల్లీ, మే 7: కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకొని.. పాకిస్థాన్‌లో సేదతీరుతున్న ఉగ్రవాదులకు అర్ధరాత్రి పూట క్షిపణి దాడులతో కాళరాత్రిని చూపించిన భారత్.. తమ ప్రతీకారం ఎలా ఉంటుందో మరోసారి రుచి చూపించింది. పహల్గాం ఉగ్రదాడి జరిగిన 14 రోజుల తరువాత శత్రువు ఊహించని విధంగా దెబ్బకొట్టింది. పాక్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో, దేశ పౌరులను కూడా అందుకు మానసికంగా సిద్ధం చేసేలా మాక్‌డ్రిల్స్ నిర్వహిస్తూ దృష్టి మరల్చింది. అందరూ అదే ఆలోచనలో ఉండగా.. నియంత్రణ రేఖ దాటకుండానే కేవలం 24 నిమిషాల వ్యవధిలో పాక్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. గతంలో ఉరిలోని సైనిక స్థావరంపై ఉగ్రదాడి, పుల్వామాలో సైనికులు ప్రయాణిస్తున్న వాహనాలపై ఆత్మాహుతి దాడి జరిగినప్పుడు కూడా భారత్ ఇలాంటి వ్యూహంతోనే ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసి ముష్కరులను మట్టుబెట్టింది. 2016 సెప్టెంబరు 18న తెల్లవారుజామున ఉరిలోని సైనిక స్థావరంపై జైషే మహ్మద్ ఉగ్రవాదులు గ్రనేడ్ దాడులకు పాల్పడి 17 మంది సైనికులను పొట్టనబెట్టుకున్నారు. కాగా, ఈ ఘటన జరిగిన పది రోజుల తరువాత సెప్టెంబరు 28న భారత్ పక్కా వ్యూహంతో ఉగ్రవాదుల పని పట్టింది.
భారత కమెండోలు నియంత్రణ రేఖను దాటి వెళ్లి మరీ.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ జరిపారు. పెద్దసంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అనంతరం పుల్వామా ఉగ్రదాడి విషయంలోనూ ఇదే వ్యూహంతో దెబ్బకొట్టారు. 2019 ఫిబ్రవరి 14న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి దళ సభ్యుడు శ్రీనగర్-జమ్మూ హైవేపై ప్రయాణిస్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్ల వాహనశ్రేణిపైకి దూసుకెళ్లి తనను తాను పేల్చుకోవడంతో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన తరువాత భారత్ కేవలం 12 రోజుల్లోనే జైషే ముష్కరులకు బుద్ధి చెప్పింది. 2019 ఫిబ్రవరి 26న పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో జైషే నిర్వహిస్తున్న ఉగ్రవాద శిక్షణ శిబిరంపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది. శిక్షణ శిబిరాన్ని నామరూపాల్లేకుండా చేయడంతోపాటు పెద్ద ఎత్తున ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News
Updated Date - May 08 , 2025 | 04:14 AM