Indian Govt: ఉగ్రదాడుల్ని ఇక యుద్ధంగానే పరిగణిస్తాం
ABN, Publish Date - May 11 , 2025 | 04:26 AM
భవిష్యత్తులో భారత్‌లో జరిగే ఉగ్రదాడులను యుద్ధంగా పరిగణిస్తామని భారత ప్రభుత్వం హెచ్చరించింది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు దాడులు చేస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేసింది.
పాకిస్థాన్‌కు భారత్ స్పష్టమైన హెచ్చరిక
న్యూఢిల్లీ, మే 10: ఉగ్రవాదం పట్ల భారతదేశం తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. భవిష్యత్తులో తమ భూభాగంపై ఎటువంటి ఉగ్రదాడి జరిగినా తమపై యుద్ధం ప్రకటించినట్టుగానే భావిస్తామని పాకిస్థాన్‌కు స్పష్టం చేసింది. తమ ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు శనివారం స్పష్టమైన హెచ్చరిక చేసినట్టు ఉన్నతస్థాయి అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా రెడ్‌లైన్ గీయాలని, పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు మరోమారు భారత్‌ను లక్ష్యంగా చేసుకొంటే పహల్గాం ఘటన తర్వాత స్పందించిన విధంగానే స్పందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ‘భవిష్యత్తులో భారతదేశంలో జరిగే ఏదేని ఉగ్రవాద ఘటనను దేశంపై యుద్ధంగానే భావిస్తాం. ప్రతిస్పందన కూడా ఆ మేరకు ఉంటుంది’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాల మధ్య శత్రుత్వం చెలరేగినప్పటి నుంచి భద్రతాపరంగా అనేక ఉన్నతస్థాయి సమావేశాలను మోదీ నిర్వహించారు. విస్తృతస్థాయి చర్చల ఫలితమే తాజా నిర్ణయం. చాలాకాలంగా తన భాభాగంపై సైనికులను, పౌరులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న ఉగ్రదాడులకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలే కారణమని భారత్ స్పష్టం చేస్తోంది.
Updated Date - May 11 , 2025 | 04:28 AM