INDIA Alliance MPs: ఢిల్లీ ఈసీ ఆఫీసుకి కదిలిన కూటమి ఎంపీలు.. అడ్డుకున్న పోలీసులు
ABN, Publish Date - Aug 11 , 2025 | 12:08 PM
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఆందోళనకర పరిస్థితి చోటుచేసుకుంది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి ఎంపీలు ఎన్నికల సంఘం కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఆ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ఢిల్లీ: ఓట్ల చోరీ ఆరోపణల నేపథ్యంలో దేశ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ పార్లమెంట్ ముఖ ద్వారం నుంచి కాంగ్రెస్, విపక్ష ఎంపీలు నిరసన ర్యాలీ చేపట్టారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు ఎన్నికల సంఘం (ECI) కార్యాలయం వైపు నిరసన ర్యాలీ చేశారు.
ర్యాలీ ఈ రోజు (ఆగస్టు 11, 2025) ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్‌లోని ముఖ ద్వారం నుంచి ప్రారంభమైంది. ఆ క్రమంలోనే మార్చ్ గా వెళ్తున్న ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీల నిరసన ప్రదర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా.. వాటిని ఎక్కి మరీ విపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు.
బారికేడ్లపైకి ఎక్కిన అఖిలేష్ యాదవ్
నిరసన ప్రదర్శన సందర్భంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోలీసుల బారికేడ్ల పైనుంచి ఎక్కి దూకారు. ఈ మేరకు పార్లమెంట్ నుంచి ఎన్నికల కమిషన్ వరకు నిరసన ప్రదర్శన చేస్తున్న ఇండియా కూటమి నేతలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. బిహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా, 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటింగ్ మోసం జరిగిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలుపుతున్నారు.
ఎంపీలు టెర్రరిస్టులా?
ఈ ర్యాలీ నేపథ్యంలో శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు ఇప్పుడు టెర్రరిస్టులా అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు తమను అడ్డుకుంటే, అది దేశంలో ప్రజాస్వామ్య సంస్థలకు ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు నిరసన చేయడానికి కూడా ఇన్ని ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు.
తర్వాత ఏం జరగబోతోంది?
బిహార్ ఓట్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, 2024లో ఓట్ల చోరీ జరిగిందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థన మేరకు ECI ఈ రోజు మధ్యాహ్నం చర్చలకు సమయం కేటాయించింది. ఈ ర్యాలీ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. ఎంపీలతో ఒక ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల అవకతవకలపై ఒక సాధారణ వ్యూహాన్ని రూపొందించే ప్రయత్నం జరుగనుంది. అంటే, ఈ ర్యాలీ కేవలం నిరసనతో ఆగిపోదు. ఇది త్వరలో మరింత ప్రణాళికతో కొనసాగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 11 , 2025 | 01:04 PM