ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Bhavan Scam: ఏపీభవన్‌లో కబ్జా దుకాణం

ABN, Publish Date - May 04 , 2025 | 05:36 AM

ఏపీ భవన్‌లో 20 ఏళ్లుగా అక్రమంగా షాపు నిర్వహిస్తున్న తమిళనాడు వ్యక్తిని ఖాళీ చేయించినా, అతడు అదే ప్రాంగణంలో కారులో మళ్లీ దుకాణం తెరిచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అధికారుల హెచ్చరికలపై కూడా అతడు సమయం అడుగుతూ అక్కడే తిష్టవేశాడు

20 ఏళ్లుగా అక్రమంగా షాపు నిర్వహణ

  • ఆరోపణలు రావడంతో ఖాళీ చేయించిన ఆర్సీ

  • కొత్తగా కారులో దుకాణం తెరిచిన ఘనుడు

  • రాత్రి ఏపీ భవన్‌లో పార్కింగ్‌.. అక్కడే బస

(న్యూఢిల్లీ-ఆంధ్రజ్యోతి)

అతను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కాదు.. ఏపీతో గానీ, తెలంగాణతో గానీ అతనికి ఏ సంబంధమూ లేదు. అయినా గత రెండు దశాబ్దాలుగా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో తిష్ఠ వేశాడు. దుకాణం నిర్వహణ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నాడు. అధికారులు దాన్ని ఖాళీ చేయించి, కూల్చివేయించినా కూడా అతను అక్కడినుంచి కదలడం లేదు. వివరాలు... ఎస్టీడీ బూత్‌ నిర్వహణ కోసం అప్పట్లో ఒక దివ్యాంగుడికి ఏపీ భవన్‌లో కేటాయించిన దుకాణాన్ని కొంతమంది అధికారుల సహకారంతో తమిళనాడుకి చెందిన ఓ వ్యక్తి స్వాధీనం చేసుకున్నాడు. అందులో నిత్యావసరాలు, పచ్చళ్లు అమ్మడంతో పాటు ట్రావెల్‌ బిజినెస్‌ చేసేవాడు. దుకాణం ముసుగులో అతను అక్రమ వ్యవహారాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పాటు ఇంటెలిజెన్స్‌ నివేదికలతో రెండు నెలల క్రితం ఏపీభవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ లవ్‌ అగర్వాల్‌ ఆ దుకాణాన్ని ఖాళీ చేయించారు. దీంతో షాప్‌ను తిరిగి తనకు అప్పగించాలంటూ ఏపీ కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక మంత్రి వద్దకు సదరు వ్యక్తి రాయబారం నడిపాడు.


ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఆ ఇద్దరు నేతలు నిరాకరించారు. అయితే కబ్జాదారుడి బాగోతాలు తెలియని దక్షిణ తెలంగాణకు చెందిన ఒక సీనియర్‌ ఎంపీ మాత్రం అతడికి మద్దతు పలికారు. కొంతమంది మాటలు నమ్మి అండగా ఉంటానంటూ రెసిడెంట్‌ కమిషనర్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయినా కమిషనర్‌ రెండు నెలల క్రితమే ఆ దుకాణాన్ని కూల్చివేయించారు. అక్రమాలకు అలవాటు పడిన కబ్జాదారుడు దుకాణాన్ని కూల్చివేసిన ప్రదేశానికి నాలుగు అడుగుల దూరంలోనే కారులో కొత్త దుకాణాన్ని తెరిచాడు. తన పాత కార్యకలాపాలను యథాప్రకారం కొనసాగిస్తున్నాడు. పగలంతా దుకాణం నిర్వహిస్తూ... రాత్రిళ్లు ఆ కారును ఏపీ భవన్‌లోనే పార్కింగ్‌ చేస్తున్నాడు. భవన్‌కు చెందిన కిందిస్థాయి ఉద్యోగులు నివాసం ఉండే పటౌడీ హౌస్‌లో అక్రమంగా ఉంటున్నాడు. శుక్రవారం బాంబు బెదిరింపులు వచ్చిన దృష్ట్యా రెండు రాష్ట్రాల భవన్‌లకు సంబంధించిన నిర్మాణాల్లో అక్రమంగా తిష్ఠ వేసినవారిని గుర్తించి సాగనంపేందుకు రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు చర్యలను చేపట్టారు. అతడిని ఖాళీ చేయాలని ఆదేశించినా ఇంకొంత సమయం అడుగుతుండటం విశేషం.

Updated Date - May 04 , 2025 | 05:36 AM