Pak Major Tahir Iqbals Emotional Plea: భారత్‌తో ఉద్రిక్తతలు.. మనం పాపులం అంటూ జాతీయ అసెంబ్లీలో పాక్ నేత కన్నీరు
ABN, Publish Date - May 08 , 2025 | 06:17 PM
భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ నేత జాతీయ అసెంబ్లీలో కన్నీరుమున్నీరైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
భారత్‌తో ఉద్రిక్తతల నడుమ పాక్ సీనియర్ నేత ఒకరు జాతీయ అసెంబ్లీ వేదికగా కన్నీరుమున్నీరయ్యారు. పాక్‌ను దేవుడే కాపాడాలని రోదించారు. పాక్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు, మాజీ ఆర్మీ అధికారి మేజర్ తహీర్ ఇక్బాల్ ఆవేదన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘మనమందరం బలహీనులం, పాపులం.. మనల్ని అల్లాహ్‌నే కాపాడాలి’’ అంటూ ఆయన రోదించారు. ఈ ప్రసంగం పూర్వాపరాల వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారత్‌తో ఉద్రిక్తతల నడుమ పాక్ నేతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని అనేక మంది కామెంట్ చేస్తున్నారు.
ఏప్రిల్ 22న పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రమూకల దాడితో భారత్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకున్న విషయం తెలిసిందే. ఈ దాడిలో అమాయకులు బలైనందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ లాంచ్ చేసింది. బుధవారం రాత్రి సమయంలో మిసైల్, డ్రోన్ దాడులతో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తరువాత కవ్వింపు చర్యలకు దిగిన పాకిస్థాన్.. భారత్‌లోని పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో ఆర్టిలరీ, డ్రోన్ దాడులకు ప్రయత్నించింది.
అయితే, పాక్ చర్యలకు భారత్ దీటుగా బదులిచ్చింది. ఎస్-400 సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థతో పాక్ యత్నాలను విఫలం చేసింది. అంతేకాకుండా, భారత సాయుధ దళాలు పాక్‌లోని పలు ప్రాంతాల్లో గగనతల రక్షణ వ్యవస్థలను కూడా ధ్వంసం చేశాయి. ప్రస్తుతం సరిహద్దు వెంబడి ఉన్న కుప్వారా, బారాముల్లా, రాజౌరీల్లో పాక్ ఆర్టిలరీ దాడులకు పాల్పడుతోంది.
ఇవి కూడా చదవండి:
భారత్-పాక్ ఉద్రిక్తతల వెనక చైనా కుట్ర ఉంది.. అమెరికా వ్యాపారవేత్త కామెంట్ వైరల్
ఇండియా డ్రోన్ అటాక్స్.. లబోదిబోమంటూ పాక్ ప్రెస్ మీట్
ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన పహల్గాం మృతుడి భార్య
Updated Date - May 08 , 2025 | 07:25 PM