Share News

China's Role in Ind Pak Conflict: భారత్-పాక్ ఉద్రిక్తతల వెనక చైనా కుట్ర ఉంది.. అమెరికా వ్యాపారవేత్త కామెంట్ వైరల్

ABN , Publish Date - May 08 , 2025 | 04:53 PM

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వెనుక చైనా కుట్ర కోణం ఉందంటూ ఓ అమెరికా వ్యాపారవేత్త చేసిన కామెంట్ ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

China's Role in Ind Pak Conflict: భారత్-పాక్ ఉద్రిక్తతల వెనక చైనా కుట్ర ఉంది.. అమెరికా వ్యాపారవేత్త కామెంట్ వైరల్
Chinas link in India Pakistan war timing

ఇంటర్నెట్ డెస్క్: ఏప్రిల్ 22, పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు అకస్మాత్తుగా భారత్‌పై అకారణంగా విషం కక్కిన రోజు ఇది. కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణాన్ని చూసి ఓర్వలేక దాయాది దేశం ఎప్పటిలాగే తన కుయుక్తులను అమలు చేసిందని ఇప్పటివరకూ విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే, దీని వెనక చైనా హస్తం ఉందని ఓ అమెరికా వ్యాపారవేత్త తాజాగా పేర్కొన్నారు. అమెరికా వాణిజ్య సుంకాల విధింపు తరువాత భారత్ వాణిజ్యపరంగా తనకు పోటీగా మారిన తరుణంలో ప్రాంతీయ ఉద్రిక్తతల కుంపట్లు రాజేస్తోందని ఎక్స్ వేదికగా కుండబద్దలు కొట్టారు.

అమెరికన్ వ్యాపారవేత్త ప్యాట్రిక్ బెట్ డేవిడ్ ఈ మేరకు వెలిబుచ్చిన అభిప్రాయం ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ‘‘భారత్, పాక్ మధ్య ఈ టైంలో ఉద్రిక్తతలు రేగడం ఆసక్తికరం. యాపిల్ లాంటి అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను భారత్‌కు మళ్లిస్తున్నామని ప్రకటించగానే భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం మొదలైంది. అమెరికా విధించిన సుంకాలు చైనాను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వాణిజ్యం భారత్ వైపు మళ్లుతోంది. దీంతో, తనకు పోటీగా నిలవగలిగిన ఓకే ఒక దేశంలో చైనా ఉద్రిక్తతలను ఈ విధంగా ప్రోత్సహిస్తోంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.


యాపిల్ సంస్థ తన ఐఫోన్ ఉత్పత్తిని భారత్‌కు మళ్లిస్తున్నట్టు ఇటీవల ప్రకటించడం వాణిజ్య ప్రపంచంలో సంచలనంగా మారింది. చైనా కేంద్రంగా ఉన్న గ్లోబల్ సప్లయ్ చైన్‌ను సమూలంగా మార్చివేసే ఘటన ఇది. 2026 ఆర్థిక సంవత్సరంలో 40 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు భారత్‌లో ఉత్పత్తి చేయించాలని యాపిల్ నిర్ణయించుకుంది. దీంతో, అమెరికాలో విక్రయించే ఐఫోన్లన్నీ దాదాపుగా భారత్‌లో తయారవుతాయి. యాపిల్‌కు చైనా సంస్థల అవసరం తగ్గిపోతుంది. ఈ విషయంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇప్పటికే విస్పష్టమైన ప్రకటన చేశారు. భారత్‌లోని ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్‌తో కలిసి ఐఫోన్ తయారీ కార్యకలాపాలను విస్తరించనున్నట్టు తెలిపారు.

యాపిల్ సప్లై నెట్‌వర్క్‌లో భారత్ ఇప్పటికే కీలకంగా మారింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ల ఉత్పత్తిలో భారత్ వాటా 18 నుంచి 20 శాతంగా ఉంది. ఈ ఏడాది చివరికి ఇది 30 శాతానికి చేరొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దేశీ తయారీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం భారత్‌వైపు పలు సంస్థలను మళ్లేలా చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు వ్యాపార అనుకూల వాతావరణం, సుస్థిర ప్రభుత్వ విధానాల కారణంగా భారత్ చైనాకు ప్రత్యామ్నాయంగా మారుతోంది.


ఈ నేపథ్యంలో కీలక ఐఫోన్ తయారీ పరికరాలను చైనా నుంచి భారత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్న యాపిల్‌కు అక్కడి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. అయితే, యాపిల్ మాత్రం తన నిర్ణయంపై ద్రుఢంగా ఉంది. సుంకాలతో తన ఉత్పత్తులకు రిస్క్ లేకుండా చూసుకోవడంతో పాటు భారత మార్కెట్‌పై మరింత పట్టు పెంచుకునేందుకు యాపిల్ డిసైడైపోయిందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

ఇండియా డ్రోన్ అటాక్స్.. లబోదిబోమంటూ పాక్ ప్రెస్ మీట్

ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన పహల్గాం మృతుడి భార్య

భారత్, పాకిస్తాన్ బలాబలాలు.. యుద్ధం వస్తే ఎవరు కింగ్..

Read Latest and National News

Updated Date - May 08 , 2025 | 05:15 PM