Tungabhadra: తుంగభద్రకు వరద ఉధృతి..
ABN, Publish Date - Jun 21 , 2025 | 01:56 PM
తుంగభద్ర జలాశయానికి వరదనీటి చేరిక రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రోజూ 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఇది రెండురోజుల నుంచి భారీగా పెరుగుతుండటంతో గత ఏడాది కొట్టుకుపోయిన 19వ క్రస్ట్‌గేట్ మరమ్మతు పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
- 50వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- 40 టీఎంసీలకు చేరిన నిల్వ
- ఆగిపోయిన క్రస్ట్‌గేట్ మరమ్మతులు
రాయదుర్గం(బెంగళూరు): తుంగభద్ర జలాశయానికి(Tungabhadra Reservoir) వరదనీటి చేరిక రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రోజూ 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఇది రెండురోజుల నుంచి భారీగా పెరుగుతుండటంతో గత ఏడాది కొట్టుకుపోయిన 19వ క్రస్ట్‌గేట్ మరమ్మతు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. క్రస్ట్‌గేట్ల బలహీనత దృష్ట్యా ఈ ఏడాది 80 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా బోర్డు తీర్మానం చేసింది. దీంతో 105 టీఎంసీల నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకే కుదించి జలాశయం భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జలాశయం ఎగువన ఈ ఏడాది ముందస్తు వర్షాలు కురవడంతో వరదనీరు వచ్చి చేరుతోంది.
ఎగువన ఉన్న శివమొగ్గ, అగుంబి, శృంగేరి లాంటి ప్రాంతాలతో పాటు జలాశయం పరివాహక ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. సాధారణంగా మే మాసంలో ఏ మాత్రం నీటిలభ్యత ఉండదు. ఈ ఏడాది మే మాసంలోనే 10 టీఎంసీల దాకా నీరు వచ్చి చేరింది. ఇప్పటి వరకు జలాశయంలో దాదాపు 40 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో బోర్డు ఆయా కాలువలకు నీటి విడుదలపై దృష్టి పెట్టి ఆయా రాష్ట్రాల వాటాల నీటిని తీసుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దీంతో 27న నీటి విడుదలపై సమావేశం ఏర్పాటు చేసుకుని బోర్డుకు స్పష్టత ఇవ్వనున్నట్లు కర్ణాటక అధికారుల నుంచి తెలిసింది. ఆంధ్ర వాటా నీటి విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఆగిపోయిన మరమ్మతులు గత ఏడాది 19వ నెంబర్ క్రస్ట్‌గేట్ కొట్టుకుపోవడంతో దాని స్థానంలో కొత్తగేటును ఏర్పాటు చేసేందుకు బోర్డు టెండర్లు పిలిచి ఏజెన్సీకి అప్పగించింది. ఎగువ నుంచి వరదనీరు జలాశయంలో వచ్చి చేరుతుండటంతో మరమ్మతు పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. 40 టీఎంసీల నిల్వకు వరదనీరు చేరుకోవడంతో పనులు చేయడం సాధ్యం కాదని ఏజెన్సీ నిర్వాహకులు ఆపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది క్రస్ట్‌గేట్ స్థానంలో అమర్చిన శాశ్వత బ్లాక్ గేట్ పూర్తిగా ఏడాది పాటు అలాగే ఉంచేసే పరిస్థితి నెలకొంది. క్రస్ట్‌గేట్‌ను బిగించే పరిస్థితి లేదని స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో 32 గేట్లలలో ఒక గేట్‌ను పూర్తిగా బ్లాక్ చేసి ఈ ఏడాది పాటు నీటి వినియోగాన్ని కొనసాగించనున్నారు. వచ్చే ఏడాది ముందస్తుగా క్రస్ట్‌గేట్ల మార్పు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు.
27న కర్ణాటక సమావేశం తుంగభద్ర జలాశయం నుంచి కర్ణాటక తన వాటా నీటిని విడుదల చేసుకునే అంశంపై 27న సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. సమావేశంలో తీర్మానం చేసి 28నుంచి నీరు విడుదల చేసేలా బోర్డుకు ఇండెంట్ సమర్పించనున్నట్లు కర్ణాటక అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం హెచ్చెల్సీలో 105 కి.మీ. వరకు కర్ణాటక తన వాటా నీటిని తీసుకుని సాగుకు వినియోగించుకునేలా ప్రణాళిక చేసుకున్నట్లు కనిపిస్తోంది.
భారీగా ఇన్‌ఫ్లో
జలాశయానికి రెండురోజుల నుంచి వరదనీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. రోజుకు 51,261 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రికి జలాశయంలో నిల్వ సామర్థ్యం 40 టీఎంసీలు దాటనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. జలాశయంలో నిల్వ సామర్థ్యం 1633 అడుగులకు గాను 1610.52 అడుగుల మేరకు చేరుకుని, 105 టీఎంసీలకుగాను 38.608 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు శుక్రవారం ఉదయం నాటి నీటిలెవెల్స్ తెలుపుతున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి జలాశయంలో కేవలం 5.79 టీఎంసీల నిల్వ ఉండేది. 80 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి చేరుకోగానే నీటిని నదికి వదలనున్నట్లు బోర్డు అధికారులు వివరిస్తున్నారు. మరింత ఇన్‌ఫ్లో పెరిగి జూలై మొదటి వారానికి జలాశయం పూర్తిగా నిండిపోయే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News
Updated Date - Jun 21 , 2025 | 01:56 PM