ఏప్రిల్ 1 నుంచి జనగణన
ABN, Publish Date - Jun 30 , 2025 | 05:54 AM
దేశంలో జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీనిని రెండు దశల్లో నిర్వహించనున్నారు. తొలిదశలో ఇళ్ల జాబితా, వాటి స్థితి, ఆస్తులు, సౌకర్యాలు వంటి వివరాలను...
2 దశల్లో నిర్వహణ.. తొలి దశలో ఇళ్లు, ఆస్తుల లెక్క.. రెండో దశలో జనాభా, కుల గణన
36 ప్రశ్నలతో సమాచార సేకరణ
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్ లకు సెన్సస్ కమిషనర్ లేఖ
న్యూఢిల్లీ, జూన్ 29: దేశంలో జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీనిని రెండు దశల్లో నిర్వహించనున్నారు. తొలిదశలో ఇళ్ల జాబితా, వాటి స్థితి, ఆస్తులు, సౌకర్యాలు వంటి వివరాలను సేకరిస్తారు. మలి దశలో జనాభా లెక్కలతో పాటు వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు, సంస్కృతి, సంప్రదాయాలు సహా ఇతర వివరాలను సేకరిస్తారు. తొలిదశ 2026, ఏప్రిల్ 1న ప్రారంభం కానుండగా, రెండో దశ 2027, ఫిబ్రవరి 1న మొదలవనుంది. తొలిదశకు ముందే సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామకంతోపాటు వారికి పని కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తి చేయనున్నారు. ఈ మేరకు జన గణన విభాగం కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పేర్కొన్నారు. ఆయా వివరాలతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఈ ప్రక్రియకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని కోరారు. జన గణనతోపాటే కుల గణను కూడా చేపట్టనున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో దానిని కూడా మలిదశలో చేపట్టనున్నారు. కాగా, దేశంలో జనగణన చేపట్టడం ఇది 16వ సారి అయితే, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేపడుతున్న 8వ జనగణనగా మృత్యుంజయ్ కుమార్ పేర్కొన్నారు. మొత్తం ప్రక్రియను మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్ విధానంలో చేపట్టనున్నారు.
అదేవిధంగా ప్రజలకు స్వీయ గణన సదుపాయం కూడా అందుబాటులో ఉండనుంది. మొత్తం డేటాకు పటిష్ఠమైన భద్రత కల్పిస్తారు. ఇక, జన గణన, వ్యక్తిగత విషయాల్లో ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు, రేడియో, టీవీ, ట్రానిసిస్టర్ వంటి ప్రశ్నలు అడిగి వివరాలు సేకరించనున్నారు. తృణధాన్యాల వినియోగం, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం, వృథానీటి నిర్వహణ, వంటగది సదుపాయం, వంటకు వినియోగించే గ్యాస్ ఎల్పీజీనా, పీఎన్‌జీనా వంటి వాటి వివరాలను కూడా నమోదు చేస్తారు. ఇక, ఇళ్లకు సంబంధించిన వివరాల్లో ఇంటి గోడలు, గచ్చు, పైకప్పుల వివరాలు, వాటి పరిస్థితిని తెలుసుకుంటారు. ఇంట్లో ఎంత మంది ఉంటారు?, ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి? వివాహిత జంటలు, కుటుంబ పెద్ద మహిళా? పురుషుడా? వంటి వివరాలను సేకరిస్తారు.
సరిహద్దులకు తుదిగడువు
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం చేసే జిల్లాలు, తాలూకాలు, పోలీసు స్టేషన్ల సరిహద్దుల నిర్ణయాన్ని ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి ముగించాలని మృత్యుంజయ్ కుమార్ సూచించారు. డిసెంబరు 31నాటికి ఉన్న సరిహద్దులను జన గణనకు ప్రామాణికంగా తీసుకుంటామని వివరించారు. గ్రామాలు, పట్టణాలను ఏకరీతి గణన బ్లాకులా విభజించనున్నట్టు తెలిపారు. ఒక్కొక్క బ్లాకుకు ఒక ఎన్యూమరేటర్‌ను నియమించనున్నట్టు పేర్కొన్నారు.
బిహార్‌లో 3 కోట్ల మంది ఓటర్లపై ఈసీ కీలక ప్రకటన
బిహార్ ఓటర్ల జాబితాకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. 2003 నాటి రాష్ట్ర ఓటర్ల జాబితాను త్వరలోనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నట్టు తెలిపింది. ఈ జాబితాలో మొత్తం 4.96 కోట్ల మంది ఓటర్ల వివరాలు ఉన్నాయని, వీరు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొంది. మిగిలిన 40 శాతం మంది ఓటర్లు మాత్రం.. ఎన్నికల సంఘం పేర్కొన్న 11 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని సమర్పించాలని తెలిపింది. ఈ ఓటర్ల సంఖ్య 3 కోట్లుగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల ఓటర్లకు మేలు జరుగుతుంది. అర్హులైన ఏ ఒక్కరూ తమ ఓటు హక్కును కోల్పోరు. అదేవిధంగా అక్రమంగా ఓటు హక్కు పొందిన వారిని నిలువరించే అవకాశం ఉంటుంది’’ అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. కాగా, బిహార్‌లో మొత్తం 7.89 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
Also Read:
యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..
నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...
For More Telugu News
Updated Date - Jun 30 , 2025 | 05:54 AM