Share News

JC Prabhakar Reddy: నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

ABN , Publish Date - Jun 29 , 2025 | 02:00 PM

JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇద్దరు నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు.. ఇద్దరూ ఏం మాట్లాడారంటే..

JC Prabhakar Reddy: నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...
JC Prabhakar Reddy

Anantapuram: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Ex MLA Kethireddy Peddareddy) తాడిపత్రి (Tadipatri)కి రావడంతో ఉద్రిక్తత (Tension) పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పెద్దారెడ్డిని తిరిగి అనంతపురానికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ (Municipal Chairman) జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) మీడియాతో మాట్లాడారు. తమకు శత్రువు పెద్దారెడ్డి మాత్రమేనని, వైసీపీ కార్యకర్తలు కాదని అన్నారు. వైసీపీ కార్యకర్తలను ఇప్పటి వరకు ఏమీ అనలేదని ఆయన స్పష్టం చేశారు. పెద్దారెడ్డి ఇళ్ళు రిజిస్ట్రేషన్ తప్పని.. ఆ ఇంటికి ప్లాన్ లేదని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట వచ్చిన ఎవరెవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో... వారి ఫోటోలు తన దగ్గర ఉన్నాయన్నారు. పెద్దారెడ్డి వెంట వచ్చిన వైసీపీ కార్యకర్తలను రప్పా రప్పా ఆడిస్తామన్నారు. ఇక నుంచి తమ కార్యకర్తలు ఎలా ఉంటారో చూడాలన్నారు. రేపటి (సోమవారం) నుంచి పెద్దారెడ్డి ఇంటిదగ్గర,, వైసీపీ కార్యకర్తలు వుంటే మా కార్యకర్తలు రప్పా రప్పా అంటే ఎలా ఉంటుందో చూపిస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.


చర్యకు ప్రతి చర్య ఉంటుంది..

peddi-reddy.jpg

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. తాను తాడిపత్రిలో ఉంటే ఆయన ఆగడాలు సాగవని టీడీపీ నేతలు భావిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కాళ్లు పట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందని, పోలీసులను అడ్డుపెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి హింసా, ముండమోపి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తన ఆస్తులను జేసీ ప్రభాకర్ రెడ్డి టార్గెట్ చేశారన్నారు. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా తాడిపత్రిలోని తన ఇంటికి కొలతలు వేయించారని, తాను మునిసిపల్ స్థలం ఆక్రమించలేదని అన్నారు. కొనుగోలు చేసిన స్థలంలోనే ఇంటి నిర్మాణం చేశానన్నారు. తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు.


కాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల కళ్లుగప్పి తాడిపత్రిలోని భగత్‌సింగ్ నగర్‌లో ఉన్న తన నివాసానికి వచ్చారు. ఈ క్రమంలో తాడిపత్రిలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తడంతో కేతిరెడ్డిని తాడిపత్రికి రావద్దని పోలీసులు పలుమార్లు సూచించారు. అయితే తాను హైకోర్టు ఆదేశాలతో తన నివాసానికి వచ్చానని చెప్పారు. ఈ క్రమంలో తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండానికి వీల్లేదని.. గతంలోవైసీపీ హయాంలో పెద్దారెడ్డి తన ఇంట్లోకి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చేశారని, తాడిపత్రిలో సమస్యలకు పెద్దారెడ్డే కారణమని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశముందని ఆయన అన్నారు. దీంతో పోలీసులు పెద్దారెడ్డి నివాసానికి వెళ్లి ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెబుతూ ఆయనను అనంతపురంకు తరలించారు.


ఇవి కూడా చదవండి:

ఆ అవకాశాలు.. టీడీపీకే వచ్చాయి..: సీఎం చంద్రబాబు

విధ్వంసం నుంచి వికాసం దిశగా..: సీఎం చంద్రబాబు

బోనాల జాతర.. గోల్కొండ కోటకు భక్తుల తాకిడి..

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 29 , 2025 | 02:00 PM