CM Chandrababu: విధ్వంసం నుంచి వికాసం దిశగా..
ABN , Publish Date - Jun 29 , 2025 | 12:14 PM
CM Chandrababu: ప్రజలకు ఇచ్చిన 94 శాతం స్ట్రైక్ రేట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, ప్రజల్లో తృప్తి చూస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఎక్కువగా ఉంటుందని సీఎం చంద్రబాబు నేతలను ఉద్దేశించి అన్నారు.

Amaravati: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆదివారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో (TDP Office) 'సుపరిపాలనకు తొలి అడుగు' పేరుతో అత్యవసర సమావేశం (Emergency meeting) ఏర్పాటు చేశారు. ఈ భేటీకి మంత్రులు (Ministers), ఎంపీలు (MPs), ఎమ్మెల్యేలు (MLAs), ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ మేరకు పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జులై 2వ (July 2nd) తేదీ నుంచి ప్రజల్లోకి కూటమి నేతలు (Kutami Leaders) వెళ్లేలా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. ఏడాదిలో ఏపీ ప్రభుత్వం సాధించిన విజయాలు.. రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాలను ప్రజలకు కూటమి నేతలు వివరించేలా దీన్ని రూపొందించారు. ఈ సందర్భంగా నేతలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. అంతకుముందు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతంతో సమావేశం ప్రారంభించారు. ముందుగా వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం సీఎం చంద్రబాబు నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ... ప్రజలు ఇచ్చిన 94 శాతం స్ట్రైక్ రేట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రజల్లో తృప్తి చూస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఎక్కువగా ఉంటుందన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం నిర్మొహమాటంగా నిర్ణయాలు తీసుకున్నామని, సుపరిపాలనకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం అని కొనియాడారు. చేసిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పుకోలేకపోవటం మనకున్న లోపమని, 2014-19 మధ్య అభివృద్ధి పరుగులు పెట్టిందని చెప్పుకోవటంలో విఫలమయ్యామన్నారు. ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమం ప్రజలకు చెప్పేందుకే జులై 2 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించాలన్నారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన దాదాపు 75 పథకాలు పునరుద్ధరించామన్నారు. విధ్వంసం నుంచి వికాసం దిశగా చేపట్టిన ప్రయాణంలో సమస్యలకు భయపడట్లేదని చెప్పుకొచ్చారు. ఏడాదిలో తొలి అడుగు మాత్రమే వేశామని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని సీఎం చంద్రబాబు నేతలకు వివరించారు.
పని తీరు మార్చుకోండి.. లేకపోతే అంతే సంగతులు..
తాను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితి, నేతల పనితీరుపై సమాచారం తెప్పించుకుంటున్నానని, అనేక మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్ని సర్వేలను విశ్లేషించి.. వాస్తవాలను బేరీజు వేస్తున్నానన్నారు. ఎమ్మెల్యేలతో శనివారం నుంచి ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నాని, రోజుకు నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. తాను చెప్పాల్సింది ఎమ్మెల్యేలకు చెబుతున్నానని, ఎమ్మెల్యేల పనితీరు మారాలని తేల్చి చెప్పారు. పనితీరు మార్చుకుంటే బాగుంటుందని లేకపోతే ఇక అంతే సంగతులని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
కొందరు ఎంతో పని చేస్తారు.. కానీ..
ఎంత పని చేశామనే అంశంతోపాటు.. ఎలా చేస్తున్నామనేది కూడా కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొందరు ఎంతో పని చేస్తారు.. కానీ మంచి పేరు రాదని.. ఇంకొందరు పెద్దగా పని చేయకున్నా.. ప్రజల్లో మంచి పేరు ఉంటుందని అన్నారు. ఇప్పుడు గెలిచిన వాళ్లు.. మళ్లీ మళ్లీ గెలవాలని, ఆ దిశగా ఆలోచన చేస్తున్నానని చెప్పారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ అదే తరహాలో ఆలోచన చేయాలని చంద్రబాబు సూచించారు. వారసత్వం ఉంది, వారసులకు హ్యాండ్ హోల్టింగ్ ఇస్తాం, కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ల మీదే ఉంటుందన్నారు. ఏమైనా లోటు పాట్లు ఉంటే సరిదిద్దుకుందామని, మన ప్రవర్తనలో ఏమైనా తప్పులుంటే సరి చేసుకుందామన్నారు. ప్రజలు, కార్యకర్తలకు నచ్చని విషయాలను మార్చుకోవడానికి సిద్దంగా ఉన్నామని, ప్రజా విశ్వాసాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
బోనాల జాతర.. గోల్కొండ కోటకు భక్తుల తాకిడి..
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ
For More AP News and Telugu News