Cheetah and Chetak Helicopters: చీతా, చేతక్ హెలికాప్టర్లకి వీడ్కోలు..200 కొత్త హెలికాప్టర్ల కోసం భారత సైన్యం ప్రయత్నాలు
ABN, Publish Date - Aug 09 , 2025 | 07:38 AM
భారతదేశం అనేక సంవత్సరాలుగా వినిపిస్తున్న ఒక సమస్యకు చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. భారత సైన్యం, వాయుసేనలో ఇంకా సేవలందిస్తున్న చేతక్, చీతా హెలికాప్టర్లు త్వరలో సేవలనుంచి తప్పుకోనున్నాయి. వాటి స్థానంలో తాజా టెక్నాలజీతో కూడిన లైట్ హెలికాప్టర్లు తీసుకోబోతున్నారు.
భారత సైన్యం ఇప్పుడు ఓ కీలక నిర్ణయానికి తీసుకుంది. గత కొన్ని దశాబ్దాలుగా సేవలందిస్తున్న చీతా, చేతక్ హెలికాప్టర్లను (Cheetah and Chetak Helicopters) కొత్త టెక్నాలజీ హెలికాప్టర్లతో భర్తీ చేయడానికి భారత్ సన్నద్ధమవుతోంది. ఈ పాత హెలికాప్టర్లు 1960ల డిజైన్‌తో ఉన్నాయి. కొత్త టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లు లేకపోవడం వల్ల చాలా సార్లు ప్రమాదాలకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో, భారత సైన్యం, వాయుసేన కలిసి 200 కొత్త హెలికాప్టర్లను సమకూర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
ఎందుకు కొత్త హెలికాప్టర్లు?
చీతా, చేతక్ హెలికాప్టర్లు మన సైన్యంలో దాదాపు 350 ఉన్నాయి, కానీ వీటి డిజైన్ చాలా పాతది. ఆధునిక ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు లేకపోవడంతో ఈ హెలికాప్టర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గతంలో జరిగిన ప్రమాదాల్లో చాలా మంది పైలట్లు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అందుకే, ఇప్పుడు ఈ పాత హెలికాప్టర్ల స్థానంలో ఆధునిక టెక్నాలజీతో కూడిన కొత్త లైట్ హెలికాప్టర్లను తీసుకొచ్చేందుకు రక్షణ శాఖ సన్నాహాలు చేస్తోంది.
ఎన్ని హెలికాప్టర్లు? ఎలాంటివి?
భారత సైన్యం 120 రెకనైసెన్స్ అండ్ సర్వైలెన్స్ హెలికాప్టర్ల (RSH) కోసం, అలాగే వాయుసేన 80 హెలికాప్టర్ల కోసం రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ (RFI) జారీ చేసింది. ఈ కొత్త హెలికాప్టర్లు రాత్రి, పగలు సర్వైలెన్స్ చేయగలగాలి. ప్రత్యేక మిషన్ల కోసం చిన్న సైనిక బృందాలను రవాణా చేయాలి. అంతర్గత, బాహ్య లోడ్‌లను మోసుకెళ్లగలగాలి. అలాగే దాడి హెలికాప్టర్లతో కలిసి స్కౌట్ రోల్‌లో పనిచేయగలగాలి. అంటే ఈ హెలికాప్టర్లు అనేక పనులను నిర్వహించాలని భారత సైన్యం ఆశిస్తోంది.
ఎందుకు ఇంత ఆలస్యం
గత రెండు దశాబ్దాలుగా ఈ చీతా, చేతక్ హెలికాప్టర్లను భర్తీ చేయాలని సైన్యం డిమాండ్ చేస్తోంది. వివిధ కారణాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ఇప్పుడు, రక్షణ శాఖ ఈ ప్రాజెక్ట్‌ను వేగవంతం చేయడానికి సిద్ధమైంది. కొత్త హెలికాప్టర్లు తీసుకొచ్చేందుకు విక్రేతల నుంచి సమాచారం సేకరించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ హెలికాప్టర్లు ఆధునిక డిజైన్, అత్యాధునిక టెక్నాలజీతో ఉండాలని, అలాగే మన సైన్యం ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచాలని రక్షణ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ మార్పు ఎందుకు ముఖ్యం?
ఈ కొత్త హెలికాప్టర్లు మన సైన్యం రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి. అత్యాధునిక సాంకేతికతతో, మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో ఈ హెలికాప్టర్లు సైనికుల భద్రతకు హామీ ఇస్తాయి. అలాగే, సర్వైలెన్స్, రవాణా, దాడి మిషన్లలో మరింత సమర్థవంతంగా పనిచేయగలవు.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? లేక మారటోరియం తీసుకోవాలా?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 09 , 2025 | 07:39 AM