Air India crash: గగన విషాదాలు
ABN, Publish Date - Jun 14 , 2025 | 04:37 AM
అహ్మదాబాద్‌లో జరిగిన దారుణ విషాద విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటి వరకూ విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు ఎవరన్నది ఒకసారి పరిశీలిద్దాం.
అమరావతి, జూన్ 13(ఆంధ్రజ్యోతి): అహ్మదాబాద్‌లో జరిగిన దారుణ విషాద విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటి వరకూ విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు ఎవరన్నది ఒకసారి పరిశీలిద్దాం.
హోమీ బాబా 1966
దేశం గర్వించదగ్గ ప్రముఖ అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా 101 విమానం జెనీవా ఏటీసీతో ఏర్పడిన సమాచార లోపంతో స్విస్ ఆల్ప్స్ పర్వతశ్రేణిలోని బ్లాంక్ కొండను ఢీకొట్టింది. 1966 జనవరి 24న జరిగిన ఆ ప్రమాదంలో హోమీ బాబా దుర్మరణం పాలయ్యారు.
సంజయ్ గాంధీ 1980
దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పెద్ద కుమారుడు, కాంగ్రెస్ పార్టీ నేత సంజయ్ గాంధీ 1980 జూన్ 23న జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్‌కు చెందిన విమానంలో వైమానిక విన్యాసాలు చేస్తున్న క్రమంలో పట్టుకోల్పోయి సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం సమీపంలో ఆయన నడుపుతున్న విమానం కుప్పకూలింది.
మాధవరావ్ సింధియా 2001
పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాధవరావు సింధియా కూడా విమాన ప్రమాదంలోనే మృతి చెందారు. కాన్పూర్‌లో జరుగుతున్న రాజకీయ సభలో పాల్గొనడానికి 10 సీట్ల ప్రైవేటు విమానంలో బయలుదేరారు. అననుకూల వాతావరణ పరిస్థితుల్లో ఆ విమానం ఉత్తరప్రదేశ్‌లోని మణిపురి వద్ద 2001, సెప్టెంబరు 30న కూలిపోయింది.
జీఎంసీ బాలయోగి 2002
తెలుగుదేశం పార్టీ నేత, లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. 2002, మార్చి 3న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సభలో పాల్గొని ఓ ప్రైవేటు హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కృష్ణా జిల్లా కైకలూరులోని ఓ చెరువులో కుప్పకూలింది.
ఓపీ జిందాల్, సురేందర్ సింగ్ 2005
పారిశ్రామికవేత్త, హరియాణా మంత్రి ఓమ్ ప్రకాశ్ జిందాల్, వ్యవసాయ మంత్రి సురేందర్ సింగ్ హెలికాప్టర్‌లో ఢిల్లీ నుంచి ఛండీగఢ్ బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ యూపీలోని సహరన్‌పూర్ సమీపంలో ప్రమాదానికి గురయింది. 2005లో జరిగిన ఈ ప్రమాదంలో మంత్రులిద్దరూ దుర్మరణం పాలయ్యారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009
ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ప్రయాణమయ్యారు. తీవ్ర అననుకూల వాతావరణ పరిస్థితుల్లో ఆయన ప్రయాణిస్తున్న బెల్ 430 హెలికాప్టర్ నల్లమల అటవీప్రాంతంలో కూలిపోయింది.
సినీనటి సౌందర్య 2004
ప్రముఖ సినీనటి సౌందర్య (కేఎస్ సౌమ్య) ఒక రాజకీయ సభలో పాల్గొనడానికి బెంగళూరు నుంచి కరీంనగర్ బయలుదేరారు. తన సోదరుడితో కలసి 2004, ఏప్రిల్ 17న హెలికాప్టర్‌లో బయలుదేరారు. నాడు జరిగిన ప్రమాదంలో వారిరువురూ మరణించారు.
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ 2021
జనరల్ బిపిన్ రావత్.... దేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన 2021, డిసెంబరు 8న సూలూరు ఎయిర్ బేస్ నుంచి వెల్లింగ్టన్ మిలటరీ కాలేజ్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణమయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు సమీపంలో ప్రమాదానికి గురయింది. ఆ దుర్ఘటనలో జనరల్ బిపిన్, ఆయన భార్య సహా మరో 11 మంది దుర్మరణం పాలయ్యారు.
Updated Date - Jun 14 , 2025 | 04:40 AM