Chennai: వారిని ప్రభుత్వమే ఆదుకోవాలి..
ABN, Publish Date - Jun 26 , 2025 | 01:05 PM
చందనపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ వేటలో టాస్క్‌ఫోర్స్‌కు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తూ చివరకు వీరప్పన్ అమర్చిన మందుపాతరకు బలైన 15 మంది కుటుంబాలు దయనీయ స్థితిలో ఉన్నాయి.
- దయనీయ స్థితిలో వీరప్పన్ మందుపాతరకు బలైన కుటుంబాల జీవితాలు
చెన్నై: చందనపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్(Smuggler Veerappan) వేటలో టాస్క్‌ఫోర్స్‌కు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తూ చివరకు వీరప్పన్ అమర్చిన మందుపాతరకు బలైన 15 మంది కుటుంబాలు దయనీయ స్థితిలో ఉన్నాయి. భర్తలను కోల్పోయిన మహిళలంతా కటిక దారిద్య్రం అనుభవిస్తున్నారు. 1993 ఏప్రిల్ 9న వీరప్పన్‌ను పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ సభ్యులతోపాటు ఎస్పీ గోపాలకృష్ణన్, మేట్టూరు సమీపం పాలారు అటవీ ప్రాంతానికి వెళ్ళారు.
అదే సమయంలో తమకు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తున్న మేట్టూరు గ్రామాలకు చెందిన 16మందిని,తన సహాయకుడు మేట్టూరు క్లిమెన్స్ తదితరులను వెంటబెట్టుకుని వెళ్ళారు. అన్ని ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉండటంతో వీరప్పన్‌ను నిర్బంధించడం ఖాయమనే భావనతో వ్యాన్‌లో వెళ్తుండగా పాలారు సమీపం సురక్కాయ మడువు ప్రాంతంలో వీరప్పన్ పాతిపెట్టిన మందుపాతర పేలడంతో ఆ వ్యాన్ తునాతునకలైంది.ఆ పేలుడులో పోలీసు లు, అటవీశాఖకు చెందిన ఏడుగు రు, గ్రామస్థులు 15మంది దుర్మర ణం చెందారు.ఆ వ్యాన్‌లోనే ప్రయాణించిన ఎస్పీ గోపాలకృష్ణన్,ఆయన సహాయకుడు క్లిమెన్స్,గోవిందప్పాడి గ్రామానికి చెందిన ఇన్‌ఫార్మర్ ఇరుసార్ మాత్రమే తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
టాస్క్‌ఫోర్స్ బెదిరింపులు...
మందుపాతర పేలుడులో వంటి నిండా గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డ ఇరుసార్ (76) మాట్లాడుతూ టాస్క్‌ఫోర్స్ అధికారుల బెదిరింపులకు భయపడి ఎప్పుడు పిలిచినా వ్యాన్‌లో వీరప్పన్ కోసం దట్టమైన అటవీ ప్రాంతాలకు వెళ్తుండేవారమని తెలిపారు. 1993లో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తనను పట్టుకునేందుకు వస్తున్నారని పసిగట్టిన వీరప్పన్ దారిలో మందుపాతరను అమర్చాడని,
ఆ సందర్భంగా జరిగిన పేలుడులో వంటి నిండా గాయాలతో బయటపడ్డానని, ప్రభుత్వం నష్టపరిహారంగా ఇచ్చిన రూ.25వేలు చికిత్సకు కూడా చాలలేదని తెలిపారు.ప్రస్తుతం వృద్ధా ప్య సమస్యలతో బాధపడుతూ మేకలను మేపుతూ కాలయాపన చేస్తున్నానని వాపోయాడు. ఇక టాస్క్‌ఫోర్స్ ఎస్పీ గోపాలకృష్ణన్ దగ్గర సహాయకుడిగా పనిచేసిన క్లిమెన్స్ మాట్లాడుతూ మందుపాతర పేలుడులో తీవ్రంగా గాయపడిన తనకు ప్రభుత్వం రూ.25వేలు నష్టపరిహారంగా ఇచ్చిందని,గాయాలు మానటానికి అది ఏ మాత్రం సరిపోలేదని తెలిపాడు.
ప్రస్తుతం 75 యేళ్ళ వయస్సులో కూలీ పనులకు వెళ్ళి కడుపు నింపుకోవాల్సిన దుస్థితిలో ఉన్నానని, కనీసం తన కుమార్తెకు ప్రభుత్వం ఏదైనా ఉద్యోగం కల్పిస్తే తన కుటుంబం దారిద్య్రం నుండి బయటపడగలదన్నారు. మూడు దశాబ్దాలుగా వీరప్పన్ మందుపాతరకు బలైన 15 మంది కుటుంబీకులు, ఆ పేలుడులో బతికి బయటపడ్డ వారిద్దరిని రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఆదుకోవాల్సిన అవసరం ఉందని మేట్టూరు గ్రామస్థులు కోరుతున్నారు.
దుస్థితిలో మృతుల కుటుంబాలు...
టాస్క్‌ఫోర్క్ దళానికి దారి చూపేందుకు వెళ్లి వీరప్పన్ అమర్చిన మందుపాతర పేలుడులోవిగతజీవులైన 15 మంది కుటుంబాలకు తలా లక్ష రూపాయలు చొప్పున, గాయపడిన క్లిమెన్స్, ఇరుసార్‌కు తలా రూ.25వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. వీరప్పన్ మందుపాతరకు ప్రాణాలు కోల్పోయినవారి భార్యలు పిన్న వయస్సులోనే వితంతువులయ్యారు. కూలి పనులు చేసుకుంటూ చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నారు.
మందుపాతరకు బలైనవారిలో కొందరి భార్యలు ఈ సందర్భంగా మాట్లాడుతూ మేకలు మేపుకుంటూ, కూలిపనులకు వెళ్ళి సంపాదిస్తూ తామంతా ప్రశాంతంగా జీవిస్తుండేవారమని, వీరప్పన్‌ను పట్టుకునేందుకు ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ అధికారులు తరచూ వచ్చి అడవిలో తమకు దారి చూపేందుకు రావాలంటూ తమ భర్తలను వెంటబెట్టుకుని వెళ్లేవారని తెలిపారు. ఆ విధంగా 1993 ఏప్రిల్ 9న బలవంతంగా తమ భర్తలను తీసుకెళ్ళారని,
ఆ తర్వాత గుర్తించడానికి వీలుపట్టనంతగా తమ భర్తల మృతదేహాలను మూటగట్టి తమ ముందు పడేసి పోయారని ఆ మహిళలు విలపించారు. మందుపాతర పేలుడులో మృతి చెందిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి భారీగా నష్టపరిహారంచెల్లించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తమ గురించి ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. కటిక దారిద్య్రం అనుభవిస్తున్న తమను ప్రభుత్వమే కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
వావ్.. మళ్లీ తగ్గిన తగ్గిన బంగారం, వెండి ధరలు
ఆరోగ్యశ్రీ మాటున మోసం చేస్తే కఠిన చర్యలు
Read Latest Telangana News and National News
Updated Date - Jun 26 , 2025 | 01:05 PM