Share News

Aarogyasri Scheme: ఆరోగ్యశ్రీ మాటున మోసం చేస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Jun 26 , 2025 | 05:10 AM

ఆరోగ్యశ్రీ మాటున ప్రైవేటు ఆస్పత్రులు చేస్తున్న మోసాలపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ తీవ్రంగా స్పందించింది. అనధికారికంగా ఆరోగ్యశ్రీ పేరిట చికిత్సలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించింది.

Aarogyasri Scheme: ఆరోగ్యశ్రీ మాటున మోసం చేస్తే కఠిన చర్యలు

  • ఖమ్మంలోని క్యూర్‌ ఆస్పత్రిపై కేసు

  • ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో స్పష్టీకరణ

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ మాటున ప్రైవేటు ఆస్పత్రులు చేస్తున్న మోసాలపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ తీవ్రంగా స్పందించింది. అనధికారికంగా ఆరోగ్యశ్రీ పేరిట చికిత్సలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించింది. తప్పుడు క్లైయిమ్స్‌ చేసే ఆస్పత్రుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ను కూడా రద్దు చేస్తామని పేర్కొంది. ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు చేస్తున్న మోసాలకు సంబంధించి మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో వచ్చిన కథనంపై ట్రస్టు స్పందించింది. కథనంలో పేర్కొన్న అంశాల ఆధారంగా విచారణకు ఆదేశించింది. ఖమ్మంలోని క్యూర్‌ ఆస్పత్రి ఆరోగ్యశ్రీ పేరుతో తప్పుడు ప్రకటనలు ఇచ్చి, వైద్యం చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని ట్రస్టు సీఈవో ఉదయ్‌ కుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. క్యూర్‌ ఆస్పత్రిపై ఖమ్మం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.


ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 436 ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఎంప్యానెల్‌ అయినట్లు ఆరోగ్య శ్రీ ట్రస్టు పేర్కొంది. ఆ ఆస్పత్రుల్లోనే ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేయించుకోవాలని సూచించింది. ఎంప్యానెల్‌ కాకుండా ఆ పేరుతో చికిత్సలు అందిస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రోగులు ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో చేరేముందు ఒకసారి నిర్ధారించుకోవాలని సూచించింది. రోగులు ఆస్పత్రిలో చేరాక ‘ముందస్తు ఆమోదం (ప్రి అథరైజేషన్‌ అప్రూవల్‌)’ అంటూ వారి సెల్‌ఫోన్‌కు మేసేజ్‌ వస్తుందని తెలిపింది. మెసేజ్‌ రాకున్నా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తామని ఆస్పత్రి యాజమాన్యం చెప్పిందంటే.. అది కచ్చితంగా మోసంగానే పరిగణించాలని పేర్కొంది. జిల్లా స్థాయిలో ఆరోగ్యశ్రీ సమన్వయకర్తలు, జిల్లా మేనేజర్లు నిరంతరం ఆస్పత్రులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కరిస్తుంటారని తెలిపింది. అవసరమైతే రోగులు ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలోని 104 నంబరుకు కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. ఎంప్యానెల్‌ ప్రైవేటు ఆస్పత్రులపై నిరంతరం తనిఖీలుంటాయని ట్రస్టు పేర్కొంది.

Updated Date - Jun 26 , 2025 | 05:10 AM