సార్క్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త గ్రూప్?
ABN, Publish Date - Jul 01 , 2025 | 05:29 AM
భారతదేశం కీలక సభ్యదేశంగా ఉన్న సార్క్(దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం)కు ప్రత్యామ్నాయంగా మరో కూటమిని ఏర్పాటు చేసేందుకు చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రయత్నిస్తున్నాయి.
దక్షిణాసియా దేశాలతో చైనా, పాక్, బంగ్లాదేశ్ మంతనాలు
భారత్‌కు కౌంటర్‌గా ఏర్పాటు యత్నాలు
న్యూఢిల్లీ, జూన్ 30: భారతదేశం కీలక సభ్యదేశంగా ఉన్న సార్క్(దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం)కు ప్రత్యామ్నాయంగా మరో కూటమిని ఏర్పాటు చేసేందుకు చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రయత్నిస్తున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్’ కథనం మేరకు ఈ విషయంలో పాక్, చైనా చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఇదే అంశంపై చైనాలోని కున్మింగ్‌లో జూన్ 19న నిర్వహించిన సమావేశంలో బంగ్లాదేశ్ కూడా భాగస్వామ్యమైంది.
‘సార్క్‌లో సభ్యదేశాలుగా ఉన్న ఇతర దక్షిణాసియా దేశాలను కొత్త గ్రూప్‌లో చేరేలా ఆహ్వానించడమే కున్మింగ్ భేటీ లక్ష్యం’ అని ఆ కథనం పేర్కొంది. శ్రీలంక, మాల్దీవులు, అఫ్ఘానిస్థాన్ సహా సార్క్ సభ్యదేశాలు కొత్త గ్రూప్‌లో చేరే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, ఈ కథనాన్ని బంగ్లాదేశ్ ఖండించింది. సార్క్‌లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్, భూటాన్, నేపాల్, మాల్దీవులు సభ్యదేశాలుగా ఉన్నాయి. 1985 డిసెంబరు 8న బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా ఏడు దేశాలతో సార్క్ ఏర్పాటైంది. 2007లో అఫ్ఘానిస్థాన్ చేరింది.
Updated Date - Jul 01 , 2025 | 05:29 AM