Operation Sindoor: యుద్ధ విమానాలు కోల్పోవడంపై స్పందించిన జనరల్ అనిల్ చౌహాన్
ABN, Publish Date - Jun 03 , 2025 | 03:54 PM
సింగపూర్ పర్యటనలో భాగంగా ఆపరేషన్ సిందూర్‌లో పలు యుద్ధ విమానాలు కోల్పోయామంటూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పరోక్షంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నానా యాగీ చేసింది.
పూణే, జూన్ 03: ఆపరేషన్ సిందూర్‌లో జరిగిన నష్టం కంటే.. ఎంత మేరకు లక్ష్యాన్ని సాధించామనేదే ముఖ్యమని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. మంగళవారం నాడు మహారాష్ట్ర పూణేలోని సావిత్రిబాయి ఫూలే యూనివర్సిటీలో భవిష్యత్తులో యుద్ధాలు, యుద్ధం అనే అంశంపై ఆయన కీలక ప్రసంగం చేశారు. భారత్‌పై మరిన్ని ఉగ్రదాడులు జరగకుండా ఉండే క్రమంలో పాకిస్థాన్‌లోకి చొచ్చుకుని వెళ్లి మరీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఆయన అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించారు.
ఈ చర్యను అధునిక ప్రపంచం ఏ మాత్రం ఒప్పుకోదని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌పై భారత్ ప్రజల్లో మరింత అసహనం వ్యక్తమయ్యే అవకాశాలున్నాయన్నారు. ఈ పహల్గాం దాడిలో ఉగ్రవాదులు మతం అడిగి మరి.. వారి కుటుంబసభ్యుల ఎదటే కాల్పులు జరిపారని గుర్తు చేశారు. దేశంలో జరిగిన ఉగ్రవాదుల చర్యల కారణంగా భారత్‌లో దాదాపు 20 వేల మందికిపైగా మరణించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
అయితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఇటీవల సింగపూర్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ యుద్ధంలో భారత్ ఆరు యుద్ధ విమానాలు కోల్పోయిందంటూ పాక్ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. యుద్ధ విమానాలు కోల్పోయిన మాట వాస్తవమే అని పరోక్షంగా చెప్పారు. అయితే ఎన్ని అనే సంఖ్యను మాాత్రం ఆయన స్పష్టం చేయలేదు.
మరోవైపు ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌ను దెబ్బ తీశామంటూ కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. కానీ ఈ ఆపరేషన్‌లో యుద్ధ విమానాలను కోల్పోయిన విషయాన్ని ఎందుకు చెప్పలేదంటూ కేంద్రాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు.. భారత్ యుద్ధ విమానాలు కోల్పోయిన సంగతి సింగపూర్ వెళ్లిన అనిల్ చౌహాన్ చెప్పడం ఎంత వరకూ సబబు అని కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది.
ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ దాడి ఘటనకు పాకిస్థాన్ కారణమనే స్పష్టమైన సాక్ష్యాలను భారత్ సంపాదించి.. ప్రపంచం ముందు ఉంచింది. అంతేకాకుండా పాకిస్థాన్‌పై తీవ్ర ఆంక్షలు విధించింది.
అదే తరహాలో పాకిస్థాన్ సైతం భారత్‌కు వ్యతిరేకంగా ఆంక్షలు విధించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకున్నాయి. సరిగ్గా అలాంటి వేళ.. పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడి చేసింది. భారత ఆర్మీ. ఈ దాడిలో 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 100 మందికిపైగా ఉగ్రవాదులు మరణించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
For National News And Telugu News
Updated Date - Jun 03 , 2025 | 04:54 PM