Bihar Intercaste Marriage Incident: దారుణం.. కన్న కూతురు ముందే అల్లుడిని హత్య చేసిన తండ్రి.. ఎందుకంటే?
ABN, Publish Date - Aug 06 , 2025 | 11:31 AM
బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్నందుకు కన్న కూతురు ముందే అల్లుడిని హత్య చేశాడు ఓ తండ్రి..
ఇంటర్నెట్ డెస్క్: బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్నందుకు కన్న కూతురు ముందే తండ్రి ఘోరానికి పాల్పడ్డాడు. అల్లుడిని గన్‌తో కాల్చి హత్య చేశాడు. అసలేం జరిగిందంటే..
దర్భంగా మెడికల్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తన్నూ ప్రియ అదే కాలేజీలో చదువుతున్న రాహుల్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించింది. అతడు బీఎస్సీ నర్సింగ్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. అయితే, వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు తమ ప్రేమ పెళ్లిని ఒప్పుకోరని భావించి కొన్ని నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. కానీ, ఇద్దరూ వారి వారి హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు.
అయితే, ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న తన్నూ ప్రియ తండ్రి ప్రేమ్‌శంకర్ ఝా కోపంతో రగిలిపోయాడు. తన కుటుంబ పరువును నాశనం చేసిందని వెంటనే తన దగ్గర ఉన్న గన్ తీసుకుని కాలేజీకి వెళ్లి తన కూతురు ప్రియ ముందే రాహుల్ కుమార్‌ను కాల్చాడు. అతడికి ఛాతిలో బుల్లెట్ తగలడంతో వెంటనే కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన స్థానిక విద్యార్థులు తన్నూ ప్రియ తండ్రిని అడ్డుకున్నారు. ఆ వెంటనే హుటాహుటినా రాహుల్ కుమార్‌ను ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రేమ్‌శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఈ విషయంపై ప్రియ మాట్లాడుతూ.. తన తండ్రి రాహుల్‌ను కాల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తన భర్త పరిస్థితికి తన కుటుంబం మొత్తం కుట్రలో భాగమని, తన పెళ్లి సమయంలో తమ రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించామని, అయినా కూడా ఇలా జరిగిందని వాపోయింది. రాహుల్‌కు న్యాయం చేయాలని స్థానిక విద్యార్థులు నిరసన చేపట్టారు. ప్రియ తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేపట్టారు. ప్రస్తుతం ఆసుపత్రి దగ్గర ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా, భారత ప్రభుత్వం కులాంతర వివాహాల వల్ల కుల వివక్ష తగ్గుతుందని, సామాజిక సమైక్యత పెరుగుతుందని నమ్ముతూ కొన్ని పథకాలు ప్రవేశపెడుతుంటే, తల్లిదండ్రులు మాత్రం కుటుంబ పరువు, ప్రతిష్టలంటూ ఇలా దారుణాలకు తెగబడుతున్నారు.
Also Read:
చట్టవిరుద్ధ యాప్‌లకు ప్రమోషన్ ఎందుకు.. విజయ్ దేవరకొండపై ఈడీ ప్రశ్నల వర్షం
స్వల్పంగా తగ్గిన బంగారం ధర .. ధరలు ఎలా ఉన్నాయంటే..
For More Latest News
Updated Date - Aug 06 , 2025 | 11:57 AM