Betting App Case: చట్టవిరుద్ధ యాప్‌లకు ప్రమోషన్ ఎందుకు.. విజయ్ దేవరకొండపై ఈడీ ప్రశ్నల వర్షం
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:18 AM
బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ఈడీ విచారణకు టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ బుధవారం హాజరయ్యారు. ఈ కేసులో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): బెట్టింగ్ యాప్స్ (Betting App Case) ప్రచారం కేసులో ఈడీ విచారణకు టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇవాళ(బుధవారం) హాజరయ్యారు. ఈ కేసులో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండను మనీ లాండరింగ్ కోణాల్లోనూ ఈడీ అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్‌ల నుంచి తీసుకున్న నగదు, కమీషన్‌లపై ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు. చట్టవిరుద్ధమైన యాప్‌లకు ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది..? అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. ఈ మేరకు విజయ్ స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు.
మరోవైపు మంచు లక్ష్మీప్రసన్నను ఆగస్టు 13వ తేదీన విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్‌రాజ్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మళ్లీ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయనని తెలిపారు ప్రకాష్‌రాజ్. అలాగే టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానాకు కూడా ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు.
తమిళనాడులో కింగ్‌డమ్ చిత్రంపై ఆందోళన..
ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ చిత్రంపై తమిళనాడులో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీలంక తమిళుల మనోభావాలను కించపరిచారంటూ తమిళ జాతీయవాద సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మూవీ ప్రదర్శించవద్దంటూ ఆందోళనకు దిగాయి. ఈ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్దకు చేరుకొని ఆందోళనకు దిగాయి.
ఈ వార్తలు కూడా చదవండి
అదంతా.. కేసీఆర్‌కు అవినీతి మరక అంటించేందుకే..
తప్పుల తడకగా కాళేశ్వరం విచారణ కమిటీ నివేదిక..
Read latest Telangana News And Telugu News