Bandi Sanjay VS Congress: కామారెడ్డి డిక్లరేషన్‌పై కాంగ్రెస్ మాట తప్పింది: బండి సంజయ్
ABN , Publish Date - Aug 06 , 2025 | 09:29 AM
కేంద్రంపై నెపం మోపి బీసీ రిజర్వేషన్ల నుంచి కాంగ్రెస్ నేతలు తప్పుకోవాలనుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. యూపీ, బెంగాల్, బీహార్ తరహాలో తెలంగాణలోనూ కాంగ్రెస్ కనుమరుగవడం తథ్యమని బండి సంజయ్ హెచ్చరించారు.
ఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ (Congress) ధర్నా చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ఆరోపణలు చేశారు. ఇది కామారెడ్డి డిక్లరేషన్ కానే కాదని.. ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషనేనని విమర్శలు చేశారు. బీసీలకు 5 శాతం పెంచి.. ముస్లింలకు అదనంగా పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(బుధవారం) ఢిల్లీ వేదికగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బీసీ ముసుగులో ముస్లింలకు వంద శాతం రిజర్వేషన్లను అమలు చేసే కుట్ర జరుగుతోందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతిస్తామని క్లారిటీ ఇచ్చారు. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు బండి సంజయ్.
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నడైనా బీసీని ప్రధాని చేశారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 48 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీనైనా సీఎం చేశారా? అని నిలదీశారు. తెలంగాణ కేబినెట్, నామినేటెడ్ పదవుల్లో ఎంతమంది బీసీలకు ఇచ్చారో చర్చిద్దామా? అని సవాల్ విసిరారు. లోక్‌సభ సభ్యుల్లో ఎంతమంది బీసీలకు సీట్లిచ్చారో సమాధానమివ్వగలరా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీనా బీసీల గురించి తమకు నీతులు చెప్పేది? అని నిలదీశారు. బీసీని ప్రధాని చేసిన ఘనత బీజేపీదేనని ఉద్ఘాటించారు బండి సంజయ్.
27 మంది బీసీ కేంద్రమంత్రులను, అనేక రాష్ట్రాలకు బీసీ సీఎంలను నియమించిన ఘనత బీజేపీదేనని బండి సంజయ్ నొక్కిచెప్పారు. కేంద్రంపై నెపం మోపి బీసీ రిజర్వేషన్ల నుంచి కాంగ్రెస్ నేతలు తప్పుకోవాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. యూపీ, బెంగాల్, బిహార్ తరహాలో తెలంగాణలోనూ కాంగ్రెస్ కనుమరుగవడం తథ్యమని బండి సంజయ్ హెచ్చరించారు. ఈరోజు న్యూఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముస్లింలకు వంద శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తోందే తప్పా బీసీల కోసం కానేకాదని స్పష్టం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌పై కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు. మైనార్టీ ఓట్ల కోసం ముస్లిం డిక్లరేషన్‌ను అమలు చేయాలనుకుంటోందని విమర్శించారు. బీసీలను ఘోరంగా మోసం చేస్తోంది. అందుకే కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందని బండి సంజయ్ ఆక్షేపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
అదంతా.. కేసీఆర్‌కు అవినీతి మరక అంటించేందుకే..
తప్పుల తడకగా కాళేశ్వరం విచారణ కమిటీ నివేదిక..
Read latest Telangana News And Telugu News