Venkaiah Naidu: యాంటీ సోషల్‌గా సోషల్ మీడియా
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:15 AM
ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా.. యాంటీ సోషల్‌గా మారుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
వార్తల్లో నిజాలకే గానీ ఇజాలకు తావు ఉండొద్దు
సామాజిక చరిత్రకు అద్దం పట్టేలా ‘విలీనం-విభజన’
నేను అభిమానించే పాత్రికేయుల్లో వెంకట్రావు ఒకరు
పుస్తకావిష్కరణ సభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా.. యాంటీ సోషల్‌గా మారుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ నాయకులు, యూట్యూబర్లు వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉంటుందని, ఈ విషయంలో వారంతా ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. హెడ్‌లైన్ డెడ్‌లైన్ కాకూడదన్నారు. బూతులు మాట్లాడే రాజకీయనేతలు ఒక్కరు కూడా మొన్నటి ఎన్నికల్లో గెలవలేదని, వాళ్లకు ఓటమే గతి అన్న విషయాన్ని గమనించాలని పరోక్షంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని తదితర వైసీపీ నేతలను ఉద్దేశించి చురకలు అంటించారు. రాజకీయా లు సహా అన్ని రంగాల్లో ప్రమాణాలు పడిపోవడం బాధకరమని అన్నారు. రాజకీయ సభల్లో 4-బీ (బస్సు, బత్తా, బాటిల్స్, బిర్యానీ) కల్చర్ రావడం విలువల పతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. వార్తల్లో నిజాలకే గానీ ఇజాలకు తావు ఉండకూడదని సూచించారు. రాజకీయ నేతలు సొంతంగా మీడియా సంస్థలు నిర్వహించడం పాత్రికేయ స్ఫూర్తికి విఘాతమేనని, ప్రజాస్వామ్యానికీ మంచిదికాదని నొక్కిచెప్పారు. గ్రామీణ అంశాలు, మాతృ భాషకు పత్రికలు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం సీనియర్ ఎడిటర్ ఇనగంటి వెంకట్రావు రచించిన ‘విలీనం- విభజన, గతం-స్వగతం, మన ముఖ్యమంత్రులు’ పుస్తకాన్ని మంగళవారం వెంకయ్య ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తాను అభిమానించే పాత్రికేయుల్లో ఇనగంటి వెంకట్రావు ఒకరని వెల్లడించారు. సమకాలీన రాజకీయాలు, సామాజిక చరిత్రకు ఈ పుస్తకం అద్దం పడుతుందని కొనియాడారు. రాజకీయాల్లోకి వచ్చిన యువతకు ఇది ఒక మంచి విషయ దీపిక అని అభివర్ణించారు. పాత్రికేయులతో పరిచయం, సంభాషణల వల్ల తాను ఎన్నోజీవితాలను చదివిన అనుభవాన్ని సముపార్జించగలిగానన్నారు. ప్రజాస్వామ్య సౌధానికి నాలుగో స్తంభమైన మీడియా బలంగా ఉండాలని ఆకాంక్షించారు. ‘‘మొదటి సారి అమ్మ శాశ్వతంగా దూరమైనప్పుడు, రెండో సారి ఉపరాష్ట్రపతి బాధ్యత చేపట్టడానికి ముందు అమ్మ లాంటి బీజేపీకి రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు నాకు దుఃఖం ఆగలేదు’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. రాజ్యాంగ పదవి చేపట్టిన నాటి నుంచి ఇంత వరకు ఎన్నడూ పార్టీ కార్యాలయానికి వెళ్లలేదని, విలువలకు లోబడి నడుచుకుంటున్నానని తెలిపారు. సభాధ్యక్షత వహించిన మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వెంకట్రావు రచనా శైలి ఓ ప్రవాహంలా సాగుతుందని కొనియాడారు. సీనియర్ పాత్రికేయులు భండారు శ్రీనివాసరావు, కట్టా శేఖర్‌రెడ్డి, కె.రామచంద్రమూర్తి, అల్లం నారాయణ, శైలేష్ రెడ్డి, మాజీ సీపీఆర్వో వనం జ్వాలానరసింహారావు, విశ్రాంత ఐఏఎస్ కె.లక్ష్మీనారాయణ, మాజీ ఐపీఎస్ చేరెడ్డి రామచంద్రనాయుడు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్
Read latest Telangana News And Telugu News