Telangana Congress: పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:23 PM
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం నాడు ఆందోళన చేపట్టారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు (Telangana Congress) ఇవాళ(మంగళవారం) ఆందోళన చేపట్టారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే లోక్‌సభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు.
బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలపాలి: మంత్రి వాకిటి శ్రీహరి
మరోవైపు.. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీకి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ కీలక నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడారు. చిత్తశుద్ధి ఉంటే కేంద్రప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవద్దని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలిపారని డిమాండ్ చేశారు. ఇప్పటికే ముసాయిదాని రాష్ట్రపతికి పంపించామని స్పష్టం చేశారు మంత్రి వాకిటి శ్రీహరి.
42శాతం బీసీ రిజర్వేషన్లకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలపాలని మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు. 50శాతం పరిమితిని ఎత్తివేయాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు కార్యచరణ రూపొందించారని చెప్పుకొచ్చారు. రేపు(బుధవారం) జంతర్ మంతర్ వద్ద దాదాపు 20,000 వేల మందితో ఆందోళన నిర్వహిస్తున్నామని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉందని ఉద్ఘాటించారు. మైనార్టీలను అడ్డుగా చూపుతూ బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకోవడం సరికాదని మంత్రి వాకిటి శ్రీహరి హితవు పలికారు.
బీజేపీ ఎమ్మెల్యేలపై ఆది శ్రీనివాస్ ఫైర్
బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు సపోర్టు చేశారని.. ఢిల్లీలో ఎందుకు మిన్నకుండిపోయారని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో కాకుండా ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. అసలు బీసీ రిజర్వేషన్ విషయంలో కవితకు ఏం సంబంధమని నిలదీశారు. కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని విమర్శించారు. ఈరోజు(మంగళవారం) పార్లమెంట్‌లో ఎంపీల వాయిదా తీర్మానాలు, రేపు (బుధవారం) ధర్నా, ఎల్లుండి(గురువారం) రాష్ట్రపతిని కలుస్తామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఎన్ని రోజులో తెలుసా..
Read latest Telangana News And Telugu News