Rain Alert IN Telugu States: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఎన్ని రోజులో తెలుసా..
ABN , Publish Date - Aug 05 , 2025 | 09:11 AM
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు పలు కీలక సూచనలు చేశారు. అత్యంత అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు.
అమరావతి, హైదరాబాద్ ఆగస్టు5 (ఆంధ్రజ్యోతి): ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ(మంగళవారం), రేపు (బుధవారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) పడనున్నాయి. కోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాల్లో వానలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు.
బుధవారం కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాలో వానలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇవాళ మన్యం అల్లూరి జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.
తెలంగాణలో మూడు రోజులు..
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ(మంగళవారం), రేపు (బుధవారం) అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించారు. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇవాళ(మంగళవారం)13 జిల్లాలు, రేపు(బుధవారం) 12 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. నిన్న(సోమవారం) హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం కొనసాగుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో నిన్న(సోమవారం) మధ్యాహ్నం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వాన దంచికొట్టింది. వర్షం ధాటికి రహదారులన్నీ చెరువులను తలపించాయి. పాఠశాలలు, కాలేజీలు, వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనాలన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు.. ఐటీ కారిడార్ పరిధిలోని సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సోమవారం రాత్రి 7 గంటల వరకు ఆఫీసుల్లోనే ఉండిపోయారు. ఖాజాగూడలోని ల్యాంకోహిల్స్ సమీపంలో తాటి చెట్టుపై పిడుగుపడి చుట్టుపక్కల్లోని ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కుత్బుల్లాపూర్ మండలం మహదేవ్‌పూర్ జీహెచ్ఎంసీ డివిజన్ ఆఫీసు పరిధిలో అత్యదికంగా 15.1, బంజారాహిల్స్‌లో 12.4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ మెట్రో రైళ్లు, స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు
For More AP News and Telugu News