Amaravati Farmers: రాజధాని రైతులకు రిటర్న్ గిఫ్ట్!
ABN , Publish Date - Aug 05 , 2025 | 07:35 AM
రాజధాని కోసం వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చింది. అయితే ఆ ప్లాట్లపై రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాలేదు, నియమాలు, సాంకేతిక కారణాలు చూపుతూ ముఖం చాటేశారు.
» రిటర్నబుల్ ప్లాట్లపై బ్యాంకు రుణాలకు మోక్షం
» అన్ని బ్రాంచ్ అధికారులకు లీడ్ బ్యాంకు ఆదేశం
» ఫలించిన రైతుల సుదీర్ఘ పోరాటం! అప్పుల ఊబిలో
» కూరుకుపోయిన రైతులకు భారీ ఊరట!
రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల రుణ కష్టాలు ఎట్టకేలకు తీరాయి. ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలిచ్చేందుకు ఎట్టకేలకు బ్యాంకులు ముందుకు వచ్చాయి. దీంతో రైతులను ఏళ్ల తరబడి వెంటాడుతున్న దా'రుణ'కష్టాల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికినట్లయింది.
గుంటూరు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రాజధాని కోసం వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం (TDP Govt) రిటర్నబుల్ ప్లాట్లు (Returnable Plots) ఇచ్చింది. అయితే ఆ ప్లాట్లపై రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాలేదు, నియమాలు, సాంకేతిక కారణాలు చూపుతూ ముఖం చాటేశారు. గత అయిదేళ్ల పాలనలో కౌలు రాక పోవడంతో పాటు, ప్రభుత్వ వేధింపులు తాళలేక చిన్న, సన్న కారు రైతులు అనేకమంది అప్పుల పాలయ్యారు. రాజధాని కోసం భూములిచ్చిన వారిలో ఎకరాలోపు ఉన్న చిన్నకారు రైతులు 20,490 మంది, ఒకటి నుంచి రెండెకరాలలోపు ఉన్న సన్నకారు రైతులు 5 వేల మంది ఉన్నారు. పోయిన ఆరేళ్లలో వారంతా బ్యాంకు రుణాల కోసం చేయని ప్రయత్నం లేదు. కానీ, బ్యాంకర్లు ససేమిరా అన్నారు. దీనికి తోడు భూములు ప్రభుత్వానికి ఇవ్వడంతో వాటిపై సహకార రుణాలు పొందే అవకాశం లేకుండా పోయింది. దీంతో రైతులు నరకం అనుభవించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వారి 'రుణ' కష్టాలు కొనసాగాయి. ఈ విషయం సీఎం దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ముందుకొచ్చిన లీడ్ బ్యాంకు
రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలివ్వాలని లీడ్ బ్యాంకు అయిన యూనియన్ బ్యాంకు తాజాగా జిల్లాలోని అన్ని బ్రాంచ్‌ల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రుణ మంజూరుకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బ్యాంకులు ఆమోదం తెలిపాయి. ఫిబ్రవరిలో జరిగిన ఎస్ఎల్బీసీలో రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించారు. కానీ, రుణాలివ్వడానికి ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో నెలన్నర క్రితం ఉండవల్లిలో సీఎం నిర్వహించిన సమావేశంలో రైతులు తమ గోడు వినిపించారు. తాజాగా జూలై 25న సబ్ కమిటీ సమావేశంలో ప్లాట్లపై రుణాలు ఇవ్వాలని తీర్మానించారు. ఈ తీర్మానం ఆధారంగా లీడ్ బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు బ్యాంకర్లు ముందుకు రావాలని రైతులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు
For More AP News and Telugu News