Eco Friendly Ganesh Idols: మట్టి గణపతికే జై!
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:56 AM
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలతో ఉత్సవాలు జరిపేందుకు నిర్వాహకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాము అనుకున్న ఎత్తులో మట్టి ప్రతిమలు లభ్యం కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలనే మండపాల్లో కొలువుదీరుస్తున్నారు.
» పారిశ్రామిక ప్రాంతంలో సిద్ధమవుతున్న విగ్రహాలు
» కోల్‌కత్తా, పెందుర్తి ఎర్రమట్టితో తయారీ
» వివిధ ఆకృతుల్లో రూపుదిద్దుతున్న కళాకారులు
విశాఖ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలతో (Eco friendly Ganesh Idols) ఉత్సవాలు జరిపేందుకు నిర్వాహకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాము అనుకున్న ఎత్తులో మట్టి ప్రతిమలు లభ్యం కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలనే (Plaster of Paris statues) మండపాల్లో కొలువుదీరుస్తున్నారు. ఈ ఏడాది ఆ సమస్యకు పరిష్కారం లభించినట్టే. మల్కాపురం ఎస్సీ కాలనీలో కోల్‌కత్తాకు చెందిన కళాకారులు పూర్తిస్థాయిలో నిర్వాహకుల ఆసక్తి తగ్గట్టుగా వివిధ రూపాల్లో మట్టి వినాయక విగ్రహాలను రూపొందిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతం మట్టి వినాయక విగ్రహాలకు కేంద్రంగా మారుతోంది. ఇక్కడ మూడునెలలుగా విగ్రహాల తయారీ సాగుతోంది. కోల్‌కత్తాకు చెందిన కళాకారులు వీటిని మట్టితోనే రూపొందిస్తుండటం విశేషం.

మల్కాపురం ఎస్సీ కాలనీకి చెందిన కళాకారుడు అనపర్తి సైదులు విగ్రహాల తయారీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. విగ్రహాల తయారీకి వీలుగా కోల్‌కత్తా నుంచి ప్రత్యేకమైన మట్టిని లారీల్లో తీసుకువచ్చారు. దీనికి పెందుర్తి ప్రాంతంలో లభ్యమయ్యే ఎర్రమట్టిని జోడించి అందమైన విగ్రహాలను రూపొందిస్తున్నారు. ముందుగా గడ్డి, ఊక, గోగు నార కర్రలతో విగ్రహాల నమూనాను సిద్ధం చేస్తున్నారు. అనంతరం ఆ విగ్రహానికి మట్టిని అద్ది, తుదిరూపును తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో విగ్రహం సిద్ధం చేసేందుకు సుమారు 20 రోజుల సమయం పడుతోందని చెబుతున్నారు. మట్టి విగ్రహాల తయారీలో నిపుణులైన కళాకారులను కోల్‌కత్తా నుంచి రప్పించి, రేయింబవళ్లు విగ్రహాలను తీర్చిదిద్దుతున్నారు. నగరంలో వీలైనన్ని మండపాల్లో మట్టి వినాయక ప్రతిమలే ప్రతిష్ఠించేందుకు వీలుగా ఈ ఏడాది గణపతి నవరాత్రి నిర్వాహకులకు అందుబాటులో ఉంచాలనే ధ్యేయంతోనే ముందుగానే సిద్ధం చేస్తున్నామని కళాకారుడు సైదులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు
For More AP News and Telugu News