Share News

Endowment Tribunal: దేవదాయ ట్రైబ్యునల్‌కుదిక్కెవరు

ABN , Publish Date - Aug 05 , 2025 | 06:28 AM

ఉన్నతాధికారి ఇచ్చిన ఆర్డర్లను.. కింద స్థాయి అధికారి వ్యతిరేకించే అవకాశం ఉందా? ఉన్నతాధికారి తిరస్కరించిన ఫైళ్లను..

Endowment Tribunal: దేవదాయ ట్రైబ్యునల్‌కుదిక్కెవరు

  • ఏడాది కాలంగా చైర్మన్‌ కుర్చీ ఖాళీ

  • 3 నెలల క్రితం సభ్యుని పదవీ విరమణ

  • ఇన్‌చార్జి మెంబర్‌గా ఎండోమెంట్‌ ఏడీసీ-1కమిషనర్‌ ఆఫీ్‌సతో పాటు ఇక్కడా ఆయనే

  • కమిషనర్‌ ఆర్డర్లను ఏడీసీ వ్యతిరేకించగలరా?

  • ట్రైబ్యునల్‌ పనితీరు, సభ్యుని నియామకంపై అభ్యంతరాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఉన్నతాధికారి ఇచ్చిన ఆర్డర్లను.. కింద స్థాయి అధికారి వ్యతిరేకించే అవకాశం ఉందా? ఉన్నతాధికారి తిరస్కరించిన ఫైళ్లను.. ఆమోదించగలరా? ఇప్పుడు దేవదాయ శాఖ ట్రైబ్యునల్‌లో ఇది పెద్ద సమస్యగా మారింది. కూటమి ప్రభుత్వం కీలకమైన ఎండోమెంట్‌ ట్రైబ్యునల్‌ను గాలికి వదిలేసింది. ఏడాదిగా చైర్మన్‌ పోస్టు ఖాళీగా ఉంది. ట్రైబ్యునల్‌ సభ్యురాలిగా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి పద్మ మూడు నెలల క్రితం బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ట్రైబ్యునల్‌ ఇప్పుడు దిక్కులేని విభాగంగా మారిపోయింది. నిబంధన ప్రకారం ఎండోమెంట్‌ ట్రైబ్యునల్‌కు జిల్లా జడ్జి హోదాలో రిటైర్డ్‌ అయిన వారిని చైర్మన్‌గా, రిటైర్డ్‌ ఐఏఎస్‌ లేదా దేవదాయ శాఖ అదనపు కమిషనర్లను సభ్యులుగా నియమిస్తారు. సభ్యుల నియామకం విషయంలో సృష్టమైన నిబంధనలున్నాయి. దేవదాయ అదనపు కమిషనర్‌ని సభ్యునిగా నియమిస్తే.. వారు ఆ ఒక్క పోస్టులోనే విధులు నిర్వహించాలి. మరో చోట కనీసం ఇన్‌చార్జి విధులు నిర్వహించడానికి కూడా వీల్లేదు. అయితే ప్రస్తుతం ట్రైబ్యునల్‌ మెంబర్‌ విషయంలో నిబంధనలు పాటించడం లేదు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి పద్మ విధుల నుంచి తప్పుకున్న తర్వాత నుంచి దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏడీసీ-1కు ట్రైబ్యునల్‌ సభ్యునిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.


రీసర్వేతో దేవదాయ రికార్డుల్లోకి సామాన్యుల భూములు

దేవదాయ శాఖ భూముల వ్యవహారం, వ్యవస్థాపకుని కుటుంబసభ్యుల విషయాల్లో వచ్చిన అభ్యంతరాలపై ట్రైబ్యునల్‌ నిర్ణయాలు తీసుకుంటుంది. భూముల వ్యవహారాల్లోకి వెళ్తే.. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రీసర్వే సామాన్య ప్రజలకు కష్టాలు తీసుకొచ్చింది. ముఖ్యంగా దేవుడి భూముల విషయంలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. సామాన్యులకు చెందిన చాలా భూములను దేవదాయ శాఖ ఆస్తులుగా రికార్డుల్లోకి ఎక్కించేశారు. రీసర్వేకు ముందు ఇలాంటి సమస్యలున్నప్పటికి, ఆ తర్వాత అధికమయ్యాయి. ముందు తరాల నుంచి ఆధీనంలో ఉన్న భూములు ఇప్పడు ఆకస్మాత్తుగా దేవదాయ శాఖ భూములుగా రికార్డుల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పటికే దేవదాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగి తమ భూములను దక్కించుకోలేక కష్టపడుతున్న వారు వేలల్లో ఉన్నారు. అలాంటి వారికి ఎండోమెంట్‌ ట్రైబ్యునలే దిక్కు.

ఇలా ట్రైబ్యునల్‌ పనిచేయగలదా?

దేవదాయ శాఖ అధికారులు, కమిషనర్‌ సాధారణంగా భూములకు ఎన్‌వోసీలు ఇచ్చే పరిస్థితి ఉండదు. మెజార్టీ కేసుల్లో దేవదాయ శాఖ కమిషనర్‌ భూములకు సంబంధించిన ఎన్‌వోసీలను తిరస్కరిస్తారు. కమిషనర్‌ ఆర్డర్‌పై ట్రైబ్యునల్‌లో చాలెంజ్‌ చేసే అధికారం సంబంధిత భూ యజమానులకు ఉంటుంది. అక్కడ తీర్పు వ్యతిరేకంగా వస్తే హైకోర్టును ఆశ్రయించవచ్చు. మెజార్టీ కేసులు ఎండోమెంట్‌ ట్రైబ్యునల్‌లోనే పరిష్కారమవుతాయి. ఇప్పుడు ఇన్‌చార్జి మెంబర్‌ ఉండడంతో ట్రైబ్యునల్‌ పనితీరు సక్రమంగా లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రైబ్యునల్‌ సభ్యునిగా ఏడీసీ-1 విధులు నిర్వహిస్తుండడంతో కొంత ఇబ్బందులు వస్తున్నాయి. భూముల ఎన్‌వోసీల విషయంలో కమిషనర్‌ ఇచ్చిన అర్డర్లకు వ్యతిరేకంగా ఆయన కింద పనిచేసే ఏడీసీ-1 ఎలా నిర్ణయం తీసుకుంటారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏడీసీ-1 ట్రైబ్యునల్‌ సభ్యునిగా ఉన్నంత కాలం దాని పనితీరు సక్రమంగా ఉండదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన కమిషనర్‌ అర్డర్లకు వ్యతిరేకంగా తీర్పులిచ్చే పరిస్థితి ఉండదని, దీని వల్ల సామాన్య భూయాజమానులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. సామాన్యులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి.. ట్రైబ్యునల్‌ చైర్మన్‌తో పాటు సభ్యుని నియామకాలు వెంటనే చేపట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Updated Date - Aug 05 , 2025 | 06:28 AM