KTR Must Apologize: నోరు జారితే బహిరంగ క్షమాపణ చెప్పాలి
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:53 AM
కమ్మ సామాజిక వర్గంపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు
కేటీఆర్‌కు కమ్మ సంఘం అల్టిమేటం
విజయవాడ(గవర్నర్‌పేట), ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ‘కమ్మ సామాజిక వర్గంపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అనుచిత వ్యాఖ్యలు చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేకుంటే వెంటనే ఆయన వాటిని ఖండించాలి. నోరు జారి ఉంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అని ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య, రాష్ట్ర వ్యాప్త కమ్మవారి సేవా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమ్మ సామాజిక వర్గం నేతలు కేటీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఏపీ కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు మాట్లాడుతూ... ‘సంఘటన వెలుగులోకి వచ్చి వారం రోజులు గడుస్తున్నా కేటీఆర్ మౌనంగా ఉంటే ఎంపీ సీఎం రమేశ్ చెప్పినట్లుగా కమ్మ సామాజిక వర్గాన్ని బూతులు తిడుతూ చేసిన అనుచిత వ్యాఖ్యలు నిజమని భావించాల్సి వస్తుంది. అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటే కేటీఆర్ క్షమాపణలు చెప్పేవరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. చాలా రోజులుగా వివాదం నలుగుతున్నా కేటీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదు? కేటీఆర్ అన్నట్లుగా చెబుతున్న మాటలకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్న సిఎం రమేశ్ కూడా వాటిని బహిర్గతం చేయాలి. బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా నోళ్లు విప్పాలి. దీనిపై బీఆర్‌ఎస్ అధినాయకత్వాన్ని నిలదీయాలి’ అని విజ్ఞప్తి చేశారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొడాలి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ... ‘మేం ఏ పార్టీకీ అనుకూలంగా వ్యవహరించడం లేదు. ఇటీవల మా సామాజిక వర్గంపై బురదజల్లే కార్యక్రమాలు కుట్ర పూరితంగా జరుగుతున్నాయి. కేటీఆర్ లాంటి నాయకుడు ఇలా మాట్లాడడం సరికాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని పేర్కొన్నారు.