Share News

Supreme Court: ఇతర రాష్ట్రాల్లో ఇంటర్‌ చదివిన తెలంగాణ విద్యార్థులూ స్థానికులే

ABN , Publish Date - Aug 06 , 2025 | 05:12 AM

మెడికల్‌ సీట్ల వ్యవహారంలో స్థానికత అంశానికి సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు వాదనలు ముగించింది. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు సీజేఐ ధర్మాసనం వెల్లడించింది.

Supreme Court: ఇతర రాష్ట్రాల్లో ఇంటర్‌ చదివిన తెలంగాణ విద్యార్థులూ స్థానికులే

  • మెడికల్‌ ప్రవేశాల్లో వాళ్లను పరిగణించాల్సిందే

  • ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వదలచుకున్నాం

  • రాబోయే రూల్‌ తెలియకపోవడం వాళ్ల తప్పు కాదు

  • వాళ్లపై వివక్ష చూపడాన్ని మేం అనుమతించం

  • నాలుగేళ్ల స్థానికత రూల్‌ 2028 నుంచి పెట్టుకోండి

  • రాష్ట్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ సలహా

  • తెలంగాణలో స్థానికత అంశంపై తీర్పు రిజర్వ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): మెడికల్‌ సీట్ల వ్యవహారంలో స్థానికత అంశానికి సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు వాదనలు ముగించింది. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు సీజేఐ ధర్మాసనం వెల్లడించింది. మంగళవారం వాదనల సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఒక సందర్భంలో మాట్లాడుతూ, తెలంగాణ స్థానికులై ఉండి, ఏదో ఒక కారణంగా ఇంటర్మీడియట్‌ చదవడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన విద్యార్థులకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వదలచుకున్నానని స్పష్టం చేశారు. 2024 తర్వాత తెలంగాణలో నిబంధనలు మారబోతున్నాయని తెలియని కారణంగా వారు వివక్షకు గురి కావడాన్ని తాము అనుమతించబోమని తేల్చిచెప్పారు. అంతేకాకుండా, చివరి నాలుగేళ్లు రాష్ట్రంలోనే చదివి ఉండాలన్న నిబంధనల అమలుకు 2028 వరకు విరామం ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన కూడా ఇచ్చారు. వైద్య విద్యలో ప్రవేశానికి స్థానికతకు సంబంధించి నీట్‌కు ముందు నాలుగేళ్లు స్థానికంగా చదవాలని నిబంధనల చేర్చుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో 33ని తీసుకొచ్చింది. జీవోలోని నిబంధన 3(ఏ)లో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొంది. ఆ జీవోను సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కల్లూరి అభిరామ్‌తో పాటు మరో 160 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం వద్ద ఎటువంటి సరైన గైడ్‌లెన్స్‌ లేవని, ముందు గైడ్‌లైన్స్‌ రూపొందించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తు సెప్టెంబరు 11న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పైౖ బుధవారం సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయి నేతృత్వంలోని జస్టిస్‌ కె వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.


పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసమిది

తెలంగాణకు చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత నివాస నిబంధనను తీసుకువచ్చిందని తెలంగాణ ప్రభుత్వం తరపు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఆర్థికంగా స్థిరపడిన సంపన్న విద్యార్థులు లండన్‌, దుబాయ్‌ సహా ఇతర విదేశాలకు వెళ్లి 11, 12వ తరగతి చదువుకుంటే ఎక్కడైనా సులభంగా మెడికల్‌ సీట్లు పొందవచ్చని చెప్పారు. అలాంటి అవకాశాలు లేకుండా తెలంగాణ స్థానికతలో చదువుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనను తీసుకొచ్చామని వివరించారు. ప్రస్తుత విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371(డి) ప్రకారం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలకు ప్రభుత్వ విద్య, ఉపాధి అవకాశాల్లో సమాన అవకాశాలు, సౌకర్యాలు అందాలని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వేర్వేరు నిబంధనలు చేయవచ్చని అందులో ఉందని చెప్పారు. 1974 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏపీలో నివసిస్తున్న వారికి కూడా నివాస ప్రయోజనం ఇచ్చామని, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఈ ప్రయోజనాన్ని కటాఫ్‌ చేశామని వివరించారు. సివిల్‌ సర్వీసెస్‌, తదితర ఉద్యోగాల్లో భాగంగా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం వల్ల అక్కడ చదువుకున్న పిల్లలకు మినహాయింపు కల్పిస్తున్నట్లు వివరించారు. లక్షల మంది తెలంగాణ స్థానిక విద్యార్థుల దృష్టి కోణంతో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. అసోం, హరియాణా రాష్ట్రాలలో స్థానికత కేసుల్లో తీర్పులను ప్రస్తావించారు. స్థానిక పాఠశాలలో 10, 11, 12 చదవాలని హరియాణా నిబంధనలు చెబుతున్నాయన్నారు. అసోంలో 7-12 స్థానికంగా చదివితేనే మెడికల్‌ అర్హత పరీక్షకు అనుమతిస్తున్నారని తెలిపారు. ఏపీలోనూ స్థానికత అమలవుతోందని, ఒక్క తెలంగాణ విద్యార్థికి కూడా అక్కడ అవకాశం కల్పించడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ విద్యార్థులకు తెలంగాణలో అవకాశం కల్పించాలని కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ మెడికల్‌ సీట్లు ఎంతో ఖరీదైనవని, పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువ డబ్బులు వెచ్చించి చదివే పరిస్థితి ఉండదని చెప్పారు. స్థానికత పూర్తి స్థాయిలో వర్తిస్తేనే రాష్ట్రంలోని విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్‌ సంపన్నవంతమైన నగరమని, ఈ కేసులో ఆర్థిక పరమైన అంశాలకు తావు లేదని, రెండేళ్లు వేరే రాష్ట్రంలో చదివితే తప్పేంటో చెప్పాలని సీజేఐ ప్రశ్నించారు.


విదేశాల్లో చదివే విద్యార్థులకు కూడా ఎన్‌ఆర్‌ఐ కోటా ఉంటుంది కదా? దానిని ఎందుకు స్థానికతతో ముడిపెడుతున్నారు? అని అడిగారు. కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం తరఫున సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకర్‌ నారాయణన్‌ వాదనలు వినిపిస్తూ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడులోనూ ఇటువంటి స్థానికత నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వ, పైవ్రేట్‌, సాంకేతిక, వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలు పదేళ్ల పాటు 371(డి) ప్రకారం జరుగుతాయని రాష్ట్ర విభజన చట్టంలోనే ఉందని, ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఇప్పుడు ఆ నిబంధన కాలం ముగిసినందున తెలంగాణ కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని తెలిపారు. ప్రతి విద్యార్థి ఆర్టికల్‌ 371(డి) గురించి తెలుసుకోవాలి అన్నట్లు వాదనలు వినిపించడం సరికాదని సీజేఐ వ్యాఖ్యానించారు. ఎనిమిదో తరగతిలోనే రాజ్యాంగం గురించి తెలుసుకోవాలన్నట్టుగా మీ వాదనలు ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. చదువుకోని తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థుల తరఫున సీనియర్‌ న్యాయవాది రాజేంత్‌ బసంత్‌, ఏఓఆర్‌ బీ దాస్‌ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణలో పుట్టి పదో తరగతి వరకు చదివినా స్థానిక కోటా దక్కడం లేదని తెలిపారు. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది. మరే ఇతర అభ్యంతరాలు ఉన్నా రాతపూర్వకంగా సమర్పించాలని ఇరు పక్షాల వారికి సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి

పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 06 , 2025 | 05:12 AM