Share News

Srishti Fertility Center: ఆది నుంచీ అక్రమాల ‘సృష్టి’ డాక్టర్‌ నమ్రత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ABN , Publish Date - Aug 06 , 2025 | 05:35 AM

సికింద్రాబాద్‌ సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌ ఆక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ప్రధాన నిందితురాలు, ఆ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్‌ నమ్రత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

Srishti Fertility Center: ఆది నుంచీ అక్రమాల ‘సృష్టి’ డాక్టర్‌ నమ్రత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

  • సరగసీ పేరుతో ఆమె చేసిన మోసాలపై కీలక విషయాలు రాబట్టిన పోలీసులు

  • ముగిసిన పోలీసు కస్టడీ.. తిరిగి జైలుకు..

  • ఆధారాలు సేకరించి స్టేట్‌మెంట్‌ రికార్డు

  • ఇతర రాష్ట్రాల్లోని శిశు విక్రయ ముఠాలతోనూ నమ్రతకు సంబంధాలు ఉన్నట్లు గుర్తింపు!

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌ ఆక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ప్రధాన నిందితురాలు, ఆ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్‌ నమ్రత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమెను ఐదు రోజులు కస్టడీకి తీసుకుని విచారించిన గోపాలపురం పోలీసులు... సృష్టిలో మోసాలపై కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. మంగళవారం పోలీసు కస్టడీ ముగియడంతో ఆమెను మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరపరిచి, తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు, సోమవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న బినామీ డాక్టర్‌ విద్యుల్లతను పోలీసులు విచారించి సృష్టిలో మోసాలపై కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఇటీవల నమ్రత రాజస్థాన్‌కు చెందిన గోపాల్‌ సింగ్‌ దంపతులను సరగసీ పేరిట నమ్మించి.. మోసగించిన విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒడిసా దంపతులకు పుట్టిన బిడ్డను రూ.90 వేలకు కొన్న నమ్రత.. ఆ బిడ్డను రాజస్థాన్‌ దంపతులకు రూ.35 లక్షలకు విక్రయించింది. కొన్నేళ్ల క్రితమే మోసాలు బయటపడి నమ్రత లైసెన్స్‌ రద్దు కావడంతో ఆమె ఇతర వైద్యులను బినామీగా పెట్టుకుని వారి పేరిట లైసెన్స్‌ తీసుకుని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, కర్ణాటక, ఒడిసా, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌ శాఖలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


పెరుగుతున్న బాధితులు

ఎంతోమంది దంపతులను సరగసీకి ఒప్పించిన డాక్టర్‌ నమ్రత.. ఒక్కో జంట నుంచి రూ.30 నుంచి రూ.50 లక్షల వరకు దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారని తెలిసింది. అనేక కోణాల్లో విచారించిన పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుండగా ఇప్పటికే నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నమ్రత ముఠాలో కీలక పాత్ర పోషించి కల్యాణి, సంతోషిలను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే 15 మందిని అరెస్టు చేయగా.. మరికొందర్ని అరెస్టు చేయవచ్చని సమాచారం.


దందాలో ఆ ముగ్గురిది కీలక పాత్ర

సరగసీ పేరుతో శిశు విక్రయాలకు పాల్పడుతున్న నమ్రతకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన చైల్డ్‌ ట్రాఫికింగ్‌ ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందని తెలిసింది. ఆ ముఠాలకు బట్టి రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు చెల్లించి చిన్నారులను కొంటున్నట్లు గుర్తించారు. ఆ పిల్లల్నే సరగసీ ద్వారా పుట్టినట్లు నమ్మించి పిల్లలు లేని దంపతుల నుంచి రూ.30 నుంచి 50 లక్షలు తీసుకుంటున్నట్లు తేలింది. ఈ దందాలో హర్ష, పవన్‌, నందిని అనే వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని పెట్టీకేర్‌, హెడ్జ్‌, ఒయాసి్‌స కేంద్రంగా తన దందాను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి

పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 06 , 2025 | 05:35 AM