Bangalore Stampede Case: బెంగళూరులో తొక్కిసలాట.. ఆర్‌సీబీ అధికారి సహా నలుగురు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ABN, Publish Date - Jun 06 , 2025 | 08:59 PM
ఇటీవల బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Bangalore Stampede Case) వద్ద జరిగిన తొక్కిసలాట కేసు నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. తాజాగా న్యాయస్థానం ఆర్‌సీబీ మార్కెటింగ్ హెడ్ సహా నలుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4, 2025న జరిగిన తొక్కిసలాట (Bangalore Stampede Case) ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు, చాలా మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం, బెంగళూరులోని ఓ కోర్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మార్కెటింగ్, రెవెన్యూ హెడ్ నిఖిల్ సోసాలే, DNA ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీకి చెందిన సునీల్ మాథ్యూ, సుమంత్, కిరణ్ కుమార్‌లను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది.
నిర్లక్ష్యం, హత్య అభియోగాలు..
నిఖిల్ సోసాలే దుబాయ్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ బెంగళూరులోని విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. అతను తన అరెస్టుకు వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, జస్టిస్ S.R.కృష్ణ కుమార్ అతనికి తక్షణ ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించి కేసు విచారణను జూన్ 9 వరకు వాయిదా వేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు RCB, DNA ఎంటర్‌టైన్‌మెంట్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA)పై FIR నమోదు చేశారు. ఈ కేసులో నేరపూరిత నిర్లక్ష్యం, హత్య అభియోగాలు మోపారు.
తొక్కిసలాట ఘటన
ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిని పరిశీలించడానికి జ్యుడీషియల్ కమిషన్ సైతం ఏర్పాటు చేసింది. జూన్ 4, 2025న ఆర్‌సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా చిన్నస్వామి స్టేడియానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే, పోలీసులు భారీగా వచ్చిన జన సమూహాన్ని నియంత్రించలేకపోయారు. పరిస్థితి చేజారడంతో ఇరుకైన ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది అభిమానులు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.
ప్రభుత్వం చర్యలు
ఈ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. బెంగళూరు పోలీసు కమిషనర్ బి. దయానంద్, మరో నలుగురు సీనియర్ పోలీసు అధికారులను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సస్పెండ్ చేశారు. తొక్కిసలాటను నివారించడంలో గల నిఘా వైఫల్యాన్ని ప్రభుత్వం అంగీకరించింది. ఈ కారణంగా, ఏడీజీపీ (ఇంటెలిజెన్స్) హేమంత్ నింబాల్కర్‌ను కూడా ట్రాన్స్ ఫర్ చేశారు.
కొనసాగుతున్న దర్యాప్తు
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. RCB, DNA ఎంటర్‌టైన్‌మెంట్, KSCA సంస్థలు నేరపూరిత నిర్లక్ష్యం, హత్యలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.
ఇవీ చదవండి:
భారతదేశంలో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ సేవలకు లైసెన్స్
ఆ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లు అస్సలు లిఫ్ట్ చేయకండి..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 06 , 2025 | 09:13 PM