Amit Shah: సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించం...తేల్చిచెప్పిన అమిత్‌షా
ABN, Publish Date - Jun 21 , 2025 | 03:09 PM
ఏప్రిల్ 21న జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై అమిత్‌షా మాట్లాడుతూ, కశ్మీర్‌లో శాంతి, పర్యాటకాన్ని దెబ్బతీసి, కశ్మీర్ యువకులను తప్పదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందని చెప్పారు.
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై కఠిన చర్యల్లో భాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేయడం ద్వారా దాయాది దేశానికి ముకుతాడు వేసింది. ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించే అవకాశం ఉందా? దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) శనివారంనాడు ఒక ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని ఆయన సమాధానమిచ్చారు. ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా తాము రద్దు చేయలేదని, పాకిస్థాన్ పదేపదే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుండటంతో చట్టపరంగా ఒప్పందాన్ని సస్పెండ్ చేశామని చెప్పారు.
'లేదు, ఎప్పటికీ ఒప్పందాన్ని పునరుద్ధరించం. అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయకూడదు. అయితే తాత్కాలికంగా నిలిపివేసే హక్కు మాకు ఉంది' అని అమిత్‌షా తెలిపారు. 1960 ఒప్పందంలోని ప్రియాంబుల్‌ను ప్రస్తావిస్తూ, ఇండియా-పాకిస్థాన్ మధ్య శాంతి, ప్రగతికి ఉద్దేశించినట్టు అందులో చెప్పడం జరిగిందని అన్నారు. అయితే దానిని ఉల్లంఘించడం అంటూ జరిగితే ఒప్పందానికి అర్ధమే లేకుండా పోతుందని అన్నారు.
కెనాల్ ద్వారా రాజస్థాన్‌కు..
తమకు హక్కుభుక్తమైన జలాలను తాము సక్రమంగా వినియోగించుకుంటామని, కెనాల్ నిర్మాణం ద్వారా నీటిని రాజస్థాన్‌కు మళ్లిస్తామని చెప్పారు. ఏప్రిల్ 21న జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై మాట్లాడుతూ, కశ్మీర్‌లో శాంతి, పర్యాటకాన్ని దెబ్బతీసి, కశ్మీర్ యువకులను తప్పదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందని చెప్పారు. కశ్మీర్‌తో పాటు యావద్దేశం ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా సంఘీభావం తెలిపిందన్నారు. పాకిస్థాన్ ఎంచుకున్న మార్గాన్ని ఏమాత్రం జాప్యం చేయకుండా తిప్పికొట్టామని చెప్పారు. జనావాసాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ దాడులు జరపడంతో పాక్ ఎయిర్‌బేస్‌లను ఇండియా ధ్వంసం చేసిందని, కాల్పుల విరమణకు పాక్ కోరడంతో అందుకు అంగీకరించామని చెప్పారు.
పహల్గాం దాడికి ప్రతిగా ఉగ్రవాద స్థావరాలకు మాత్రమే దాడులను పరమితం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థిరనిశ్చయంతో ఉన్నారని అమిత్‌షా చెప్పారు. 'కేవలం లక్షిత దాడులకే మేము పరిమితం అవుతున్నామని చాలా స్పష్టంగా చెప్పాం. అయితే టెర్రరిస్టులపై మనం చేసిన దాడులను తమ భూభాగంపై జరిపిన దాడులు గానే పాకిస్థాన్ భావిస్తూ వచ్చింది' అని ఆయన వివరించారు.
కాంగ్రెస్‌కు ఆ హక్కు లేదు
ఆపరేషన్ సిందూర్‌తో సహా భారతదేశం తీసుకున్న మిలటరీ చర్యలపై కాంగ్రెస్ చేసిన విమర్శలను అమిత్‌షా తిప్పికొట్టారు. కాంగ్రెస్ తమ హయాంలో ఏమి చేసింది? మంత్రిని మార్చడం మినహా వాళ్లు చేసిందేమీ లేదు. ఉగ్రవాదంపై కాంగ్రెస్ సహా ఏ రాజకీయ పార్టీకీ తమను విమర్శించే హక్కులేదని అమిత్‌షా స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఆ ముగ్గురినీ వెంటనే ఉద్యోగంలోంచి తీసేయండి.. ఎయిరిండియాకు డీజీసీఏ ఆదేశం..
ఎన్నికల ముందు భారీ పెన్షన్ గిఫ్ట్.. మూడు రెట్లు పెంచిన సీఎం
For National News And Telugu News
Updated Date - Jun 21 , 2025 | 04:03 PM