Nitish Kumar: ఎన్నికల ముందు భారీ పెన్షన్ గిఫ్ట్.. మూడు రెట్లు పెంచిన సీఎం
ABN , Publish Date - Jun 21 , 2025 | 01:43 PM
బీహార్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కీలక ప్రకటన చేసింది. సామాజిక భద్రతా పెన్షన్ స్కీం కింద వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు ఇప్పుడు ప్రతి నెలా రూ. 400కు బదులుగా రూ. 1100 పెన్షన్ లభిస్తుందని సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) అన్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ఎన్నికల ముందు గుడ్‌న్యూస్ అనౌన్స్ చేశారు. సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద లబ్ధి పొందే వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచుతూ కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు వారు నెలకు పొందుతున్న రూ.400కి బదులుగా ఇకపై రూ.1100 లభించనుంది. ఇది ఆయా వర్గాల జీవనోపాధిలో ఎంతో ఊరటను కలిగించనుంది.
జూలై నుంచే అమలు
ఈ పెరిగిన పెన్షన్ మొత్తాన్ని జూలై నెల నుంచి అమలులోకి తేనున్నట్లు సీఎం నితీష్ తెలిపారు. ప్రతి నెలా 10వ తేదీన లబ్ధిదారుల ఖాతాలో నేరుగా డబ్బు జమ చేయనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో దాదాపు 1 కోటి 9 లక్షల 69 వేల 255 మంది లబ్ధిదారులు ఈ పెరిగిన పెన్షన్ వల్ల లబ్ధి పొందనున్నారు. ఈ పెన్షన్ పెంపు గురించి స్వయంగా సీఎం నితీష్ కుమార్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు.
సమాజానికి ఆదర్శం
వృద్ధులు సమాజానికి విలువైన భాగమని, వారికో గౌరవప్రదమైన జీవితం కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని నితీష్ అన్నారు. బీహార్ ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలతో పాటు, ఇప్పుడు సామాజిక భద్రతా పథకాన్ని మరింత బలోపేతం చేయడం మంచి పరిణామమని చెప్పవచ్చు. ఇది ప్రధానంగా పేద వర్గాలకు మంచి నిర్ణయంగా పరిగణించబడుతుంది.
ఈ పెన్షన్ పెంపు వల్ల లబ్ధి ఏంటి
మూడు రెట్లు పెరిగిన పెన్షన్ (రూ.400 నుంచి రూ.1100)
నెలకు స్థిరమైన ఆదాయం
వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆర్థిక భద్రత
ప్రభుత్వంపై నమ్మకం పెరగడం
ఎన్నికల వేళ సామాన్యుల మద్దతు పొందే అవకాశం
ఇవీ చదవండి:
ఏఐ పవర్డ్ గ్లాసెస్‌ను విడుదల చేసిన మెటా.. ఫీచర్లు చూశారా..
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి