Amith Shah: ఇంగ్లీష్ మాట్లాడే వారు.. సిగ్గు పడే రోజులు ఎంతో దూరంలో లేవు
ABN, Publish Date - Jun 19 , 2025 | 04:21 PM
మన చరిత్ర, మన సంస్కృతి, మన ప్రాంతీయతను అర్థం చేసుకునేందుకు ఏ విదేశీ భాషకు సాధ్యం కాదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, జూన్ 19: కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీషులో మాట్లాడే వారు సిగ్గు పడే రోజులు రానున్నాయన్నారు. ఆ సమయం ఎంతో దూరంలో లేదని ఆయన వ్యాఖ్యానించారు. జాతి ఐక్యతకు భారతీయ భాషలే ఆత్మ వంటివన్నారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఐఏఎస్ మాజీ అధికారి అష్‌తోష్ అగ్నిహోత్రి రచించిన పుస్తకాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. మన దేశంలోని భాషలే.. మన సంస్కృతికి రత్నాలు అని అభివర్ణించారు.
భాషలు లేకుంటే మనం భారతీయులమే కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మన చరిత్ర, మన సంస్కృతి, మన ప్రాంతీయతను అర్థం చేసుకునేందుకు ఏ విదేశీ భాషకు సాధ్యం కాదని స్పష్టం చేశారు. విదేశీ భాషలతో భారతీయ భావనను సంపూర్ణంగా అర్థం చేసుకోలేరన్నారు. మన భాషలతో కూడిన ఆత్మ గౌరవంతో మన దేశం ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సివిల్ సర్వీసెస్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో మార్పు అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సాహిత్యాన్ని ప్రశంసించారు. ఇది సమాజానికి ఆత్మ వంటిదన్నారు. మన దేశం కటిక చీకటి యుగంలో మునిగిపోయినప్పుడు సైతం సాహిత్యం.. మన మతం, స్వేచ్ఛ, సంస్కృతి.. దీపాలను వెలిగించిందని అమిత్ షా గుర్తు చేశారు. ప్రభుత్వం మారినప్పుడు.. ఎవరూ దానిని వ్యతిరేకించరన్నారు. కానీ ఎవరైనా మన మతం, సంస్కృతి, సాహిత్యాన్ని తాకడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం మన సమాజం వారిని ఎదుర్కొని, ఓడించిందని గుర్తు చేశారు. అందుకే సాహిత్యం.. మన సమాజానికి ఆత్మ వంటిదని కేంద్ర మంత్రి అమిత్ షా విశ్లేషించారు.
ఈ వార్తలు కూడ చదవండి..
విశాఖ తీరంలో చేపల వేటపై ఆంక్షలు.. ఎందుకంటే..
For National News And Telugu News
Updated Date - Jun 19 , 2025 | 06:20 PM