Share News

YS Jagan: జగన్ అప్పుడలా.. ఇప్పుడిలా..

ABN , Publish Date - Jun 19 , 2025 | 02:27 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. పరామర్శల యాత్ర పేరుతో చేస్తున్న యాత్రల కారణంగా తీవ్ర గలాటా జరుగుతోంది.

YS Jagan: జగన్ అప్పుడలా.. ఇప్పుడిలా..
YCP Chief YS Jagan

అమరావతి, జూన్ 19: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శల పేరిట జరుపుతున్న పర్యటనల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అందుకు తెనాలి, పొదిలి, తాజాగా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలే అందుకు ఉదాహరణ. అయితే తాజాగా వైఎస్ జగన్ విలేకర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం నడుస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఈ పాలన వల్ల రాష్ట్రంలో అక్రమ అరెస్టులు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. ఆ క్రమంలోనే చెవిరెడ్డిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. అయితే వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాకుండా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న సంఘటనలు ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.


ఇటీవల వైఎస్ జగన్ తన పర్యటనలు పరామర్శ యాత్రలాగా కాకుండా.. భారీగా ఫ్లెక్సీలు, గజమాలలతో అతిపెద్ద ఎత్తున సాగుతోందని చెబుతున్నారు. తెనాలి పరామర్శ యాత్రలో అంతంత మాత్రంగా వ్యవహరించిన వైఎస్ జగన్.. పొదిలి పర్యటనకు వచ్చే సరికి కాస్తా పెరిగిందని.. కానీ సత్తెనపల్లికి వచ్చే సరికి ఈ యాత్ర పరాకాష్ఠకు చేరినట్లు అయిందనే విమర్శలు వెల్లువెత్తాయి.


ఏడాది క్రితం కొలువు తీరిన కూటమి ప్రభుత్వం.. వైఎస్ జగన్ పర్యటనలపై ఏనాడు ఆంక్షలు విధించ లేదని వారు గుర్తు చేస్తున్నారు. కానీ పల్నాడులోని సత్తెనపల్లిలో మాత్రం జగన్ పర్యటనపై ఆంక్షలు విధించారని వివరిస్తున్నారు. అది కూడా ఎందుకంటే.. ఆ ప్రాంతం సున్నీతమైందని వివరిస్తున్నారు. అదీకాక.. పొదిలి, రెంటపాళ్లలో వైఎస్ జగన్ పర్యటన సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై రాతలతోపాటు సోషల్ మీడియా వేదికగా పలు వార్త కథనాలు ఆ ప్రాంతాల్లో హల్ చల్ చేశాయని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.


అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతల లక్ష్యంగా వైఎస్ జగన్ వ్యవహరించిన తీరును వారు ఎండగడుతున్నారు. పార్టీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, దూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, గల్లా జయదేవ్, పట్టాబి తదితరులను అరెస్ట్ చేశారని వివరించారు. అంతే కాకుండా.. సొంత పార్టీలోని అసమ్మతి నేత, నాటి ఎంపీ రఘురామ కృష్ణంరాజును సైతం అరెస్ట్ చేసి.. నానా ఇబ్బందులకు గురి చేశారని అంటున్నారు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నారు. ఇక టీడీపీ కార్యాలయాలపై సైతం దాడులు చేశారు.


అక్కడితో ఆగకుండా టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసి.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారని.. దీంతో 52 రోజుల తర్వాత ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు అయిందని సోదాహరణగా వివరించారు. ఇక నందిగామలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయనపైకి రాయి విసిరితే.. అది ఆయన భద్రతా సిబ్బందికి తగిలి.. గాయపడ్డారన్నారు.


అదీకాక.. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సొంత చిన్నాన్నా వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ హత్యకు కర్మ కర్త క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబు అంటూ.. నారా వారి రక్త చరిత్ర పేరటి కథనాలను సైతం వండి వార్చింది వైసీపీ కాదా? అనే ప్రశ్న సైతం వారు వేస్తున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ వివేకా హత్య కేసు అంశంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎటువంటి చర్యలు తీసుకున్నారంటే.. ఆ విషయం అందరికి తెలిసిందేనంటున్నారు. తమ ప్రభుత్వం హయంలో జరిగిన సంఘటనలు పక్కన పెట్టి.. తాజాగా కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ చేస్తున్న ఆరోపణలు చూస్తే.. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందనే అభిప్రాయం సర్వత్ర వ్యక్తమవుతోంది.

ఈ వార్తలు కూడ చదవండి..

విదేశాలకు విమానం బ్లాక్ బాక్స్..!

విద్యార్థులు విన్నపం.. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం


For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 19 , 2025 | 03:39 PM