AISATS: విమాన ప్రమాదం తరువాత పార్టీ.. ఎయిర్ ఇండియా-ఎస్ఏటీఎస్ సీనియర్ ఉద్యోగులకు ఉద్వాసన
ABN, Publish Date - Jun 28 , 2025 | 10:22 AM
ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్‌పోర్టు గేట్‌వే సర్వీసెస్ ప్రొవైడర్ ఏఐఎస్ఏటీఎస్‌లోని నలుగురు ఉన్నతాధికారులు ఆఫీసులో పార్టీ ఏర్పాటు చేశారు. సిబ్బంది ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే..
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన కొన్ని రోజులకే ఆఫీసులో భారీ పార్టీ ఏర్పాటు చేసినందుకు నలుగురు ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ సీనియర్ అధికారులు ఉద్వాసనకు గురయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు బయటపడటంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, తక్షణం జాబ్స్‌కు రాజీనామా చేయాలని సంస్థ వారికి తేల్చి చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్‌పోర్టు గేట్‌వే సర్వీసెస్ ప్రొవైడర్ ఏఐఎస్ఏటీఎస్‌లోని నలుగురు ఉన్నతాధికారులు ఆఫీసులో ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలిసింది. సిబ్బంది ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. అయిన వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఎయిర్ ఇండియా ప్రమాద బాధితులు ఉంటే అధికారులు, సిబ్బంది ఇలా అత్యంత నిర్లక్ష్యంగా పార్టీలు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నెట్టింట కలకలం రేగింది.
ఈ వైరల్ వీడియోలపై ఏఐఎస్ఏటీఎస్ సంస్థ స్పందించింది. బాధ్యతారహితంగా వ్యవహరించిన వారిపై తగు చర్యలు చేపట్టినట్టు సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రవర్తన తమ సంస్థ విలువలకు అనుగుణంగా లేదని అన్నారు. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. కస్టమర్ల విషయంలో బాధ్యతతో తమ విధులు నిర్వహించేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు. గేట్‌వే సర్వీస్, ఫుడ్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎస్ఏటీఎస్ లిమిటెడ్, ఎయిర్ ఇండియాలు సంయుక్తంగా ఏఐఎస్ఏటీఎస్‌ను ఏర్పాటు చేశాయి.
జూన్ 12ను లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కూప్పకూలిన విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్టుకు సమీపంలోని భవనంపై విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మినహా విమానంలోని వారందరూ కన్నుమూశారు. 11ఏ నెంబర్ సీటులోని భారత సంతతి బ్రిటన్ పౌరుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలను తేల్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చదవండి:
కశ్మీర్ రిసార్ట్‌లో ఎలుగుబంటి కలకలం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 28 , 2025 | 11:31 AM