Air India Crash:101 మృతదేహాలు బంధువులకు అప్పగింత.. కొనసాగుతోన్న ప్రక్రియ
ABN, Publish Date - Jun 17 , 2025 | 12:49 PM
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. డీఎన్‌ఏ పరీక్షల కోసం ఫోరెన్సిక్ నిపుణులు నిరంతరాయంగా పని చేస్తున్నారు.
అహ్మదాబాద్, జూన్ 17: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతోన్నాయి. ఇప్పటి వరకు 135 మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించారు. అందులో 101 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మరికొన్ని అప్పగించవలసి ఉందని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి మంగళవారం వెల్లడించారు.
మరోవైపు ఈ అంశంపై ఆ రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి హర్ష సంఘ్వీ స్పందించారు. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి.. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు. అందుకు గుజరాత్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొందని ఆయన వివరించారు. డీఎన్‌ఏ గుర్తించే క్రమంలో ఫోరెన్సిక్ బృందాలు నిరంతరాయంగా తమ పనిని కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. అ ప్రక్రియ అంతా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరుగుతోందని తెలిపారు. మిగిలిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి సాధ్యమైనంత త్వరగా వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని స్పష్టం చేశారు.
ఈ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఇప్పటికే అందజేశారు. ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. అలాగే ఈ విమానం కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మృతదేహాన్ని సైతం ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మృతదేహాన్ని ముంబైలోని ఆయన నివాసానికి మంగళవారం ఉదయం చేరుకుంది. ఈ మృతదేహానికి సైతం అంత్యక్రియలు నిర్వహించేందుకు సుమీత్ కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జూన్ 12వ తేదీ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం లండన్‌కు టేకాఫ్ అయింది. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకు కుప్పకూలి దగ్ధమైంది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికుల్లో ఒక్కరు మినహా అందరూ మరణించారు. అలాగే ఈ విమానంలో 12 మంది సిబ్బంది ఉన్నారు. వారు సైతం మరణించారు. ఈ విమానం బీజే హాస్టల్‌పై పడడంతో.. ఆ సమయంలో భోజనం చేస్తున్న మెడికోలు సైతం మరణించారు. అయితే ఈ విమాన ప్రమాదం కారణంగా.. మృతదేహాలన్నీ దాదాపుగా కాలిపోయాయి. గుర్తు పట్టే విధంగా లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఆ మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి.. వారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారు.
Updated Date - Jun 17 , 2025 | 12:56 PM