NEET Aspirant Suicide: మరో నీట్ స్టూడెంట్ ఆత్మహత్య.. ఒక్క నెలలో రెండో కేసు, కారణం అదేనా..
ABN, Publish Date - May 26 , 2025 | 12:51 PM
రాజస్థాన్ కోటాలో నీట్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మరో 18 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సూసైడ్ (NEET Aspirant Suicide) చేసుకోవడానికి కొన్ని సెకన్ల ముందు ఒక అబ్బాయితో ఫోన్‌లో మాట్లాడింది. అయితే అసలు ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో రాజస్థాన్ కోటా నీట్ పోటీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చేందుకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా ఉంది. ఇక్కడ కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయని అనేక మంది భావిస్తుంటారు. ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో కోచింగ్ కోసం వచ్చిన విద్యార్థుల ఆత్మహత్యలు (NEET Aspirant Suicide) కూడా పెరుగుతున్నాయి. గతంలో ఇదే విషయంలో సుప్రీంకోర్టు సైతం అక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది. ఈ సంవత్సరం కోటాలో జరిగిన 14 ఆత్మహత్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ విషయాన్ని తేలికగా తీసుకోకూడదని, తీవ్రంగా పరిగణించాలని కూడా చెప్పింది. ఈ విషయంలో కోటా ఎస్పీకి కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.
నెల రోజుల క్రితం
ఈ క్రమంలోనే తాజాగా మరో 18 ఏళ్ల విదార్థిని సూసైడ్ చేసుకుంది. జమ్మూ కశ్మీర్ నివాసి అయిన విద్యార్థిని జీషాన్ నీట్ కోసం ప్రిపేర్ అయ్యేందుకు నెల రోజుల క్రితం కోటాకు వచ్చారని మహావీర్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి రమేష్ కవియ తెలిపారు. ఆ విద్యార్థిని మహావీర్ నగర్ ప్రతాప్ కూడలి వెనుక అద్దె ఇంట్లో ఉండేది. ఈ క్రమంలోనే అద్దె ఇంట్లోని ఒక గదిలో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు ఆ విద్యార్థిని గురించి, ఆమె పరిచయస్తులు, స్నేహితుల గురించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ విద్యార్థిని చివరగా జమ్మూ కశ్మీర్‌లో బుర్హాన్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నట్లు చెప్పారు. మాట్లాడుతూనే ఆ విద్యార్థిని తన గదికి వెళ్లిందన్నారు.
సూసైడ్ నోట్
ఆ క్రమంలో బుర్హాన్ తన ఫోన్ డిస్‌కనెక్ట్ చేసి, కోటాలో తనకు తెలిసిన ఒక అమ్మాయికి సమాచారం ఇచ్చి, జీషాన్ దగ్గరకు వెళ్ళమని అడిగినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పరిచయస్థురాలైన అమ్మాయి ఆమె ఇంటికి చేరుకునేసరికి, గది గేటు లోపలి నుంచి మూసి ఉంది. ఆ తరువాత, సమీప ప్రాంతాల వారికి విషయం తెలిపి గది డోర్ కట్టర్‌తో కత్తిరించగా, విద్యార్థిని లోపల ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకున్న గదిలో ఉరిని నిరోధించే ఫ్యాన్స్ లేవని పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. ఈ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరణాల కట్టడి కోసం..
అయితే కోటాలో ఫ్యాన్ సూసైడ్ మరణాలను నిరోధించేందుకు ఆ ప్రాంతాల్లోని హాస్టళ్లు సహా విద్యార్థులకు అద్దెకు ఇచ్చే గదుల్లో స్ప్రింగ్‌తో వేలాడే ఫ్యాన్లను అమర్చాలని గతంలో ప్రభుత్వం ఆదేశించింది. వాటిని ఉపయోగించడం వల్ల ఫ్యాన్ సూసైడ్ మారణాలను అరికట్టవచ్చని తెలిపింది. కానీ ఈ విధానాన్ని అక్కడి వారు పాటించకపోవడం కూడా వారి మరణాలకు మరింత అవకాశాలు పెరుగుతున్నాయని పలువురు వాపోతున్నారు. దీంతోపాటు గతంలో నీట్ కోచింగ్ సమయంలో తక్కువ మార్కులు వచ్చిన వారిపై కూడా ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలు చేసుకున్న కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఇవీ చదవండి:
నేడు పంజాబ్ vs ముంబై మధ్య కీలక మ్యాచ్..
సీక్రెట్ కోడ్ ట్రిక్స్.. సైబర్ నేరాలకు చెక్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 26 , 2025 | 03:16 PM