Manchurian History: ఓర్నీ తస్సాదియ్యా.. మంచూరియా మనదేనా.. స్టోరీ తెలిస్తే షాకే..
ABN, Publish Date - Aug 07 , 2025 | 01:43 PM
చికెన్ మంచూరియా అనే పేరు వింటే ఇది చైనా వంటకం అనిపిస్తుంది కదా? కానీ, ఇది చైనీస్ వంటకం కాదు. భారతదేశంలో పుట్టిన ఫ్యూజన్ వంటకం. అసలు చికెన్ మంచూరియాను ఎవరు కనిపెట్టారు? ఎలా చేశారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: చికెన్ మంచూరియా అంటే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, చికెన్ మంచూరియా అనే పేరు వింటే ఇది చైనా వంటకం అని చాలా మంది అనుకుంటారు. కానీ, ఇది చైనీస్ వంటకం కాదు. భారతదేశంలో పుట్టిన ఫ్యూజన్ వంటకం. అసలు చికెన్ మంచూరియాను ఎవరు కనిపెట్టారు? ఎలా చేశారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
చికెన్ మంచూరియా భారతదేశంలో పుట్టిన ఇండో-చైనీస్ ఫ్యూజన్ వంటకం. ఫ్యూజన్ వంటకం అంటే వివిధ దేశాల లేదా ప్రాంతాల వంటకాల రుచులను కలిపి కొత్త వంటకాలను సృష్టించడం. చికెన్ మంచూరియా.. ఈ పేరు మాత్రం చైనీస్ లా ఉన్నా ఇది భారతీయుల రుచికి తగ్గట్లు తయారైంది. చైనాలో కన్నా భారత్, ఇతర విదేశాల్లోని భారతీయ రెస్టారెంట్లలో ఇది చాలా పాపులర్.
చికెన్ మంచూరియన్ ఎలా చేశారు?
చికెన్ మంచూరియా వంటకాన్ని 1975లో ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో, ఒక చైనీస్-ఇండియన్ చెఫ్ నెల్సన్ వాంగ్ రూపొందించాడు. అతను కోల్‌కతాలో జన్మించి, తర్వాత ముంబైకి వచ్చాడు. ఒకసారి ఎవరో అతడిని కొత్త వంటకం తయారు చేయండి అని అడగడంతో, అతను ఈ ప్రత్యేకమైన వంటకాన్ని తయారు చేశాడు.
భారతీయులకిష్టమైన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వాడి, చైనీస్ పదార్థాలైన సోయా సాస్, కార్న్ ఫ్లోర్ కూడా కలిపాడు. ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలను వేసి వేయించి చికెన్ మంచూరియన్ చేశాడు. ఈ వంటకం స్పైసీగా ఉండడంతో భారతీయులకి చాలా నచ్చింది.
ఇది చైనాలో ప్రసిద్ధి చెందలేదా?
చికెన్ మంచూరియన్ మన ఇండియా, UK, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో భారతీయ రెస్టారెంట్లలో చాలా ప్రసిద్ధం. అయితే చైనాలో మాత్రం ఇది చాలామందికి తెలియదు. అందుకే మీరు షాంఘై లేదా బీజింగ్ లాంటి నగరాలకు వెళ్లినా, మంచూరియన్ దొరికేది కేవలం భారతీయ రెస్టారెంట్లలోనే.
ఇండో-చైనీస్ వంటకాలు
చికెన్ మంచూరియన్‌తో పాటు, గోబీ మంచూరియన్, పనీర్ మంచూరియన్ లాంటి వంటకాలు కూడా చాలా పాపులర్ అయ్యాయి. నెల్సన్ వాంగ్.. చైనా గార్డెన్ అనే ప్రసిద్ధ రెస్టారెంట్‌ను ముంబైలో ప్రారంభించి ఈ వంటకాలకు గుర్తింపు తీసుకువచ్చాడు. తర్వాత అతని కొడుకు ఎడ్డీ వాంగ్ ఈ రెస్టారెంట్ బ్రాంచ్‌లను దేశవ్యాప్తంగా విస్తరించాడు.
నెల్సన్ వాంగ్
నెల్సన్ వాంగ్ కుటుంబం కోల్‌కతా చైనా టౌన్ నుంచి వచ్చింది. ఈ ప్రాంతంలో ఒకప్పుడు 20,000 మందికి పైగా చైనీస్-ఇండియన్‌లు నివసించేవారు. 1700ల చివరలో గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ (చైనాలోని ఒక ప్రాంతం) నుంచి ఆచి అనే నావికుడు భారత్‌కు వచ్చాడు. అతను కోల్‌కతా సమీపంలో చెరకు తోట ప్రారంభించాడు. ఆచితో పాటు వచ్చిన చైనా కార్మికులు, అక్కడే స్థిరపడిపోయారు. అలా అక్కడ టాంగ్రా ప్రాంతంలో చైనీస్ సమాజం ఏర్పడింది.
ఈ సమాజం చర్మశుద్ధి కేంద్రాలు, దంత వైద్యశాలలు, రెస్టారెంట్ మొదలైన వ్యాపారాలను నడిపింది. వాళ్ళు భారతదేశంలో సుస్థిరంగా జీవించేవారు. వారి వంటకాలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి. అయితే, 1962 భారత-చైనా యుద్ధం ప్రభావం కారణంగా చైనా వ్యతిరేక భావనలు పెరిగాయి. చాలా మంది చైనీస్-ఇండియన్‌లు భారత్‌ను విడిచిపెట్టి వెళ్లారు. అప్పటి 20,000 జనాభాలో ఇప్పుడు కేవలం 4,000 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. అయితే, చైనా రెస్టారెంట్లు, ఇండో-చైనీస్ వంటకాలు ఇంకా బతికే ఉన్నాయి. చికెన్ మంచూరియన్, నూడుల్స్ వంటి పాపులర్ ఫ్యూజన్ వంటలు వాళ్ల ద్వారా మనకు వచ్చాయి. కోల్‌కతాలోని చైనాటౌన్ ఇంకా పాక కళలు, సంస్కృతి విషయంలో ప్రత్యేకంగా నిలుస్తుంది.
Also Read:
రైలు Vs రోడ్.. హిమాలయ యాత్రకు బెస్ట్ ఆప్షన్ ఏది?
వెనక్కు తగ్గేదే లే.. ట్రంప్‌కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్..
For More Latest News
Updated Date - Aug 07 , 2025 | 02:53 PM