NY Mayor Zohran Mamdani: ట్రంప్‌నకు ఝలక్.. న్యూయార్క్ నగర మేయర్‌గా జొహ్రాన్ మమ్దానీ ఎన్నిక
ABN, Publish Date - Nov 05 , 2025 | 09:19 AM
భారత సంతతికి చెందిన డెమాక్రెటిక్ నేత జొహ్రాన్ మమ్దానీ చరిత్ర సృష్టించారు. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో మరో చరిత్ర ఆవిష్కృతమైంది. న్యూయార్క్ నగర మేయర్‌గా డెమాక్రెటిక్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన జొహ్రాన్ మమ్దానీ ఎన్నికయ్యారు. జొహ్రాన్ ఎన్నికైతే నిధులు నిలిపివేస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ఖాతరు చేయని న్యూయార్క్ ప్రజలు మమ్దానీకే పట్టం కట్టారు. నగర మేయర్‌గా ఎన్నికైన తొలి ముస్లింగా, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా మమ్దానీ చరిత్ర సృష్టించారు. ఆఫ్రికాలో జన్మించిన మమ్దానీకి ప్రజలు నగర పగ్గాలు అందించడం ఈ ఎన్నికల్లో ఆవిష్కృతమైన మరో విశేషం (Zohran Mamdani Elected NY Mayor).
కేవలం 34 ఏళ్ల వయసులోనే జొహ్రాన్ మమ్దానీని మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్నారు. గత వందేళ్లల్లో అత్యంత పిన్న వయస్కుడైన మేయర్‌గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. అమెరికా వ్యాప్తంగా ఆధిపత్య పోకడలు వేళ్లూనుకుంటున్న వేళ డెమాక్రెటిక్ పార్టీకి ఈ విజయం కొత్త ఊపునిచ్చిందని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.
తన విజయంపై మమ్దానీ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. మేయర్ కార్యాలయం ఉన్న సిటీ హాల్ ట్రెయిన్ స్టేషన్ వీడియోను కూడా షేర్ చేశారు. తన గమ్యానికి చేరుకున్నట్టు వినూత్న శైలిలో తెలిపారు.
జొహ్రాన్ మమ్దానీ 1991 అక్టోబర్ 18న ఉగాండాలోని కంపాలా నగరంలో జన్మించారు. ఆయన తండ్రి ఉగాండాకు చెందిన మహమూద్ మమ్దానీ. మమ్దానీ తల్లి భారతీయ ఫిల్మ్ మేకర్ మీరా నాయర్. ఉదారవాద పురోగామి ఎజెండాతో ప్రచారం నిర్వహించిన మమ్దానీకి ప్రజలు పట్టం కట్టడం డెమాక్రెటిక్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. గతంలో పార్టీకి దూరమైన ఉదారవాద భావజాల జనాలు మరోసారి డెమోక్రాట్‌లకు మద్దతుగా నిలిచారు. అమెరికాలో సంప్రదాయ వాద భావజాలం వేళ్లూనుకుంటున్న తరుణంలో వామపక్ష, పురోగామి వాద సమర్థకులైన స్వింగ్ ఓటర్లు డెమోక్రటిక్ పార్టీవైపు మొగ్గు చూపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ న్యూయార్క్ జనాలు మమ్దానీకి అధికారం కట్టపెట్టారు. మమ్దానీ బయట నుంచి వచ్చిన వ్యక్తి అని, తమ వాడు ఎప్పటికీ కాలేడని జాతీయవాద రిపబ్లికన్లు చేసిన ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారు. ఇరు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలో దాదాపు 2 మిలియన్‌ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత 50 ఏళ్లలో చూడని స్థాయిలో ఓటింగ్ జరిగింది.
ఇవి కూడా చదవండి:
హెబ్-1బీ వీసా.. లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల పరిశీలన ప్రారంభం
అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు చెనీ కన్నుమూత
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 05 , 2025 | 10:42 AM