Share News

US Department of Labor: హెబ్-1బీ వీసా.. లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల పరిశీలన ప్రారంభం

ABN , Publish Date - Nov 04 , 2025 | 10:38 AM

లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల పరిశీలనను మళ్లీ ప్రారంభించినట్టు అమెరికా కార్మిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. హెచ్-1బీ వీసాతో పాటు గ్రీన్ కార్డుకు సంబంధించి లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తులను ఫ్లాగ్, ఇతర పోర్టల్స్ ద్వారా సమర్పించొచ్చని పేర్కొంది.

US Department of Labor: హెబ్-1బీ వీసా.. లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల పరిశీలన ప్రారంభం
US Labor Certification Processing Resumes

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా షట్ డౌన్ కారణంగా నిలిచిపోయిన వీసా సంబంధిత లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల పరిశీలన మళ్లీ ప్రారంభమైంది. శాశ్వత, తాత్కాలిక ఉపాధి కార్యక్రమాల తాలూకు దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ (ఓఎఫ్ఎల్‌సీ) కార్యాలయం మళ్లీ ప్రారంభించిందని అమెరికా కార్మిక శాఖ తాజాగా పేర్కొంది (US Department of Labor). అమెరికా చట్టసభల నుంచి నిధుల విడుదలకు అనుమతులు రాక ప్రభుత్వం షట్ డౌన్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ప్రతిష్టంభన వీడలేదు. ఈ నేపథ్యంలో అనేక కీలక ప్రభుత్వ సేవలు నిలిచిపోయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 30న లేబర్ సర్టిఫికేషన్ సేవలను కూడా నిలిపివేశారు. తాజాగా వాటిని ప్రభుత్వం పునరుద్ధరించింది (Foreign Labor Certification Processing Resumption).

కార్మిక శాఖ ప్రకటన ప్రకారం, విదేశీ ఉద్యోగులపై ఆధారపడే సంస్థలు హెచ్-1బీ వీసాలకు సంబంధించిన లేబర్ కండీషన్ అప్లికేషన్‌ను ఫారిన్ లేబర్ అప్లికేషన్ గేట్‌వే (ఫ్లాగ్) సిస్టమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక గ్రీన్ కార్డు స్పాన్సర్‌షిప్‌కు సంబంధించిన పీఈఆర్‌ఎమ్ లేబర్ సర్టిఫికేషన్స్‌కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్లాగ్ పోర్టల్‌తో పాటు సీజనల్ ఉద్యోగ దరఖాస్తులకు ఉద్దేశించిన మరో వెబ్‌సైట్ కూడా అందుబాటులోకి వచ్చింది.


దాదాపు నెల రోజుల పాటు ఈ పోర్టల్స్ నిలిచిపోవడంతో అనేక సంస్థలు ఇబ్బందుల పాలయ్యాయి. హెల్త్ కేర్, ఐటీ రంగాలపై అధిక ప్రభావం పడింది. దరఖాస్తుల పరిశీలన నిలిచిపోవడంతో పాటు కొత్త దరఖాస్తుల దాఖలు, పాత దరఖాస్తుల అప్‌డేషన్ కూడా సాధ్యపడక అనేక సంస్థలు ఇక్కట్లపాలయ్యాయి. ఫలితంగా దరఖాస్తులు పేరుకుపోవడంలో ప్రాసెసింగ్ టైమ్ మరింత పెరుగుతుందని కూడా కార్మిక శాఖ పేర్కొంది. మార్చ్‌లో దాఖలైన అప్లికేషన్స్‌ కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

అరేబియాలో అపురూపం .. ఈ ఆధ్యాత్మిక ఘట్టం

అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం: నాట్స్

Read Latest and NRI News

Updated Date - Nov 04 , 2025 | 10:48 AM